AP Govt : 44,776 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:40 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 15 పారిశ్రామిక సంస్థల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.

19,980 మందికి నేరుగా ఉపాధి
ఇప్పటివరకు 3 ఎస్‌ఐపీబీ భేటీల్లో 3.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఓకే
ఏపీలో పెట్టుబడులకు ప్రఖ్యాత సంస్థల ఆసక్తి: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల ఆకర్షణలో పొరుగు రాష్ట్రాలతో భారీ పోటీ
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకోవాలి
ఎస్‌ఐపీబీ భేటీలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 15 పారిశ్రామిక సంస్థల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. దీంతో కొత్తగా రూ. 44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఆ పరిశ్రమల ద్వారా నేరుగా 19,980 మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో గురువారం 3వ ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 15 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ. 14,378 కోట్లతో ఏర్పాటు చేసే ఇంధన ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపారు. అన్నమయ్య జిల్లాలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 10,300 కోట్ల పెట్టుబడులకు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎకోరాన్ ఎనర్జీ ఇండియా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్ ప్లాంటు విస్తరణ, అనంతపురం జిల్లాలో టాటా పవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లా కోడూరులో నెలకొల్పే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఓకే చెప్పారు. ఇప్పటివరకు 3 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో మొత్తంగా రూ. 3,10,925 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.
ఒప్పందాలను నిరంతరం సమీక్షించాలి
పారిశ్రామికవేత్తలతో చేసుకున్న ఒప్పందాలను నిరంతరం సమీక్షిస్తూ ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులతో మాట్లాడుతూ వారి ఒప్పందాలన్నీ సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ నెలకొంది కాబట్టి పారిశ్రామికవేత్తలు అటువైపు వెళ్లకుండా రాష్ట్రానికి రప్పించాలని, దీనికోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేసి చూపాలని చెప్పారు. రాష్ట్రస్థాయి అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు సూచించారు. పెట్టుబడులపై జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. దావోస్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్, డెన్మార్క్‌కు చెందిన ఏపీ ముల్లర్- మార్క్స్ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలుంటే పెట్టుబడులు పెట్టే సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతి అవకాశాన్ని పెట్టుబడులు వచ్చేలా ఉపయోగించుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో 20 శాతం వృద్ధికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ వర్గాలను ఆదేశించారు.
ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన సంస్థలు, పెట్టుబడులు
అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1,500 మెగావాట్లు, చిత్తంవలసలో 800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ 14,378 కోట్లతో ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 3,450 మందికి ఉపాధి లభిస్తుంది.
అన్నమయ్య జిల్లా కొమ్మూరులో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 10,300 కోట్లతో 3000 మందికి ఉపాధి కల్పించే పంప్డ్ స్టోరోజీ జల విద్యుత్ కేంద్రానికి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 118.80 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరి రెన్యూవబుల్ ప్రైవేటు లిమిటెడ్ ఆసిక్తి కనబరచింది. ఈ ప్రాజెక్టు రాకతో 150 మందికి ఉపాధి లభిస్తుంది
అనంతపురం జిల్లాలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 972.23 కోట్లతో చేపడుతుంది. ఇందులో 225 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1,163.11 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పిస్తూ 231 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎకోరాన్ ఎనర్జీ ఇండియా 201.30 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టును రూ. 1,651 కోట్లతో నిర్మిస్తుంది. దీని ద్వారా 255 మందికి ఉద్యోగాలు వస్తాయి.
అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 4,435 కోట్లతో కర్నూలు జిల్లాలో 498.30 మెగావాట్ల పునరుద్పాదక విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 630 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అంపిన్ ఎనర్జీ సంస్థ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ. 3,142 కోట్లతో 350 మెగావాట్ల సామర్థ్యంతో పవన, సౌర విద్యుత్తు కేంద్రాన్ని స్థాపిస్తుంది. ఇందులో 200 మందికి ఉద్యోగాలొస్తాయి.
ఎస్‌ఏఈఎస్ సంస్థ రూ. 3,456 కోట్లతో 600 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ విద్యుత్తు సంస్థలను అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టులతో 2,070 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
అనంతపురంలో 400 మెగావాట్ల సామర్థ్యంతో రూ. 2,000 కోట్లతో టాటా పవర్ సంస్థ సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో 1,380 మందికి ఉపాధి లభిస్తుంది.
ఎన్‌ఎస్ఎల్ సంస్థ అనంతపురంలో 50 మెగావాట్ల విండ్, సోలార్ హైబ్రీడ్ ప్లాంట్లను రూ. 567 కోట్లతో ఏర్పాటు చేస్తుంది. ఇందులో 170 మందికి ఉపాధి లభిస్తుంది.
కాకినాడ జిల్లాలో కోరమండల్ ఇంటర్నేషనల్ రూ. 1,539 కోట్లతో ఫెర్టిలైజర్ ప్లాంటును విస్తరించనున్నది. ఈ ప్లాంటులో 750 మందికి ఉద్యోగాలు వస్తాయి.
అపెప్, ఈఎంసీ కొప్పర్తి సంస్థలు కడప జిల్లా కోడూరులో రూ. 305 కోట్లతో 6,000 మందికి ఉపాధి కల్పించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతాయి.
పెట్టుబడులను ట్రాక్ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక, వాణిజ్య సంస్థలతో సహా జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని ఎస్‌ఐపీబీ భేటీలో సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పుష్కలంగా లభ్యమయ్యే సహజ వనరులు, పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు వారు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను ట్రాక్ చేసి వారు రాష్ట్రంలో పరిశ్రమలు, వర్తక, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా రూ. పది కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి సంస్థను తప్పనిసరిగా ట్రాక్ చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో పొరుగు రాష్ట్రాల నుంచి భారీ పోటీ ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. గత రెండు ఎస్‌ఐపీబీలతో సహా.. ఇప్పటి మూడో ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News