Share News

Bengaluru stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 04 , 2025 | 07:41 PM

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Bengaluru stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, జూన్ 04: కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనను బాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఈ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన విషాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉండడం మరింత బాధకరమని చెప్పారు. వేడుకల్లో ఇంత విషాదం జరగడం చాలా దురదృష్టకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.


మరోవైపు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు. అయితే ఈ విజయోత్సవ ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారన్నారు. వారిపై పోలీసులు ఎటువంటి లాఠీ ఛార్జీ చేయలేదని స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఇంత అని ఆయన చెప్పలేనన్నారు.


ఎందుకంటే.. క్షతగాత్రులను వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. ఈ నేపథ్యంలో వారిని ప్రశ్నలతో వేధించలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ ర్యాలీకి భారీగా పోలీసులను మోహరించామని చెప్పారు. కానీ ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇక మంగళవారం జరిగిన ర్యాలీ మాత్రం సజావుగానే సాగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ఈ కార్యక్రమం కేవలం 10 నిమిషాల్లోనే ముగిసిపోయేదన్నారు. కానీ లక్షలాది మంది ఈ ర్యాలీకి విచ్చేశారన్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. సిద్దరామయ్య ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ ర్యాలీకి భారీగా ప్రజలు తరలి వస్తారని తెలిసినా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. కేంద్రం అలర్ట్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 08:00 PM