AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. లక్కీ ఛాన్స్ ఎవరికీ
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:58 AM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. అనంతరం నామినేషన్ ఉప సంహరించే అవకాశాన్ని అభ్యర్థులకు కల్పిస్తారు.
అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఆ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు అయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణను చేపట్టనున్నారు. మంగళవారం అంటే.. జులై 1వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనేది ఒక ప్రకటన చేయనున్నారు.
ఇక ఈ నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం వాటిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మాత్రం జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక బీజేపీ నేత, ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తున్నారు.
ఎంపీగా ఎన్నికైన పురందేశ్వరి..
అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసి.. బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విదితమే. కాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి.. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు పేర్లు తెర మీదకు వచ్చాయి.
అధ్యక్షుడెవరు..?
అదీకాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఎన్నికవుతారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ పదవి పీవీఎన్ మాధవ్‌కు దక్కే అవకాముందనే చర్చ సైతం బలంగా సాగుతుంది. ఎందుకంటే.. ఇటీవల రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని సీఎం చంద్రబాబు కేటాయించారు. ఈ స్థానానికి తొలుత పీవీఎన్ మాధవ్ పేరును బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ కొద్ది సేపటికి ఈ ఎమ్మెల్సీ పదవికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం బలంగా వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. ఆ తర్వాత ఏమైందంటే..
ఆత్మాహుతి దాడి.. పాకిస్థాన్ ఆరోపణలు ఖండించిన భారత్
For More AP News and Telugu News