MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ.. రిజల్ట్ మారుతుందా..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:54 PM
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం వచ్చింది. ఫిబ్రవరి 27న ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య గట్టి పోటి ఉంది, వీటి ఫలితాలు ఎప్పుడు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్రంలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డులను తీసుకుని వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీ బృందాలు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లను నియమించింది. ఓటర్లు సురక్షితంగా ఓటు వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది.
తెలంగాణలో..
అయితే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ (ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే నల్లగొండ, వరంగల్, ఖమ్మం (ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఇందులో 15 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, 19 మంది నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నారు.
ఏపీలో ఎంత మంది..
ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.
ఫలితాలు ఎప్పుడంటే..
ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి. ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ, బీజేపీ మధ్య..
మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకం కానున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ, బీజేపీ మధ్య పోటీ జరుగుతోంది. వైసీపీ, జనసేన తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆయా పార్టీల గెలుపు తర్వాత విభేదాలు వస్తాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానంలో కూడా అధికార టీడీపీకి విజయం సాధించడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఓటర్లు కొత్తగా వచ్చిన ప్రభుత్వం విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
For AndhraPradesh News And Telugu News