Share News

Andhra Pradesh: జీబీఎ్‌సతో మరో మరణం

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:57 AM

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు జీబీఎ్‌సతో మరణించగా, ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

Andhra Pradesh: జీబీఎ్‌సతో మరో మరణం

ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళంలో ఆరేళ్ల బాబు మృతి.. తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ మరణం

ఇప్పటి వరకు వెలుగులోకి 59 కేసులు

ప్రస్తుతం ఆస్పత్రుల్లో మరో 14 మంది

నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి

లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరాలి

అమరావతి/గుంటూరు మెడికల్‌/కొమరోలు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌(జీబీఎస్‌) మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు జీబీఎ్‌సతో మరణించగా, ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి.. ఆదివారం మృతి చెందారు. కమలమ్మ ఈనెల 2వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డారు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు తొలుత గిద్దలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సిఫారసు మేరకు ఈనెల 3న గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా జీబీఎస్‌ పాజిటివ్‌గా తేలింది.

gkhj.jpg

దీంతో ఐసీయూలో చికిత్సను అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇమ్యునో గ్లోబిలిన్‌ ఇంజెక్షన్ల కోర్సును కూడా ప్రారంభించారు. అయితే వ్యాధి తీవ్రత కారణంగా కోలుకోలేకపోయిన కమలమ్మ.. ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ సీజన్‌లో ఏపీలో ఇది రెండో జీబీఎస్‌ మరణం. గత వారం శ్రీకాకుళం జిల్లాలో యుగంధర్‌ అనే బాలుడు జీబీఎ్‌సతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో.. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, కొన్ని చోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేశారు.


ప్రస్తుతం రాష్ట్రంలో 59 కేసులు వెలుగులోకి వచ్చాయి. పలువురు చికిత్స పొంది, డిశ్చార్జ్‌ అవ్వగా.. ప్రస్తుతం 14 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో ఉన్నారు. డిశ్చార్జ్‌ అయినవారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కొవిడ్‌ సోకితే.. కనీస వ్యాధి లక్షణాలు తెలిసేవి. అయితే.. జీబీఎస్‌ విషయంలో ప్రారంభంలో అందరికీ ఒకే లక్షణాలు ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ విషయంలో ప్రపంచ మరణాల రేటు 2శాతంగా ఉండగా.. జీబీఎ్‌సలో అది 7ు అని గుర్తుచేస్తున్నారు. సకాలంలో గుర్తించి, వైద్యం అందిస్తే ఇబ్బంది ఉండదని, రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు మరణాలు ఆలస్యంగా ప్రభుత్వాస్పత్రులకు తీసుకురావడం వల్లే చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం బాలుడి విషయంలో.. నాలుగైదు ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించాక.. ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా మహిళ విషయంలోనూ.. నాలుగైదు ఆస్పత్రుల్లో చూపించాక.. గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వ్యాధి నిర్ధారణ, వైద్యం అందించడంలో ఆలస్యం కారణంగా.. ఈ మరణాలు సంభవించినట్లు వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా బయటపడుతున్నట్లు వివరిస్తున్నారు. కొందరిలో దగ్గు, జ్వరంతోపాటు.. వెంటనే కాళ్లు పట్టేయడం జరుగుతోందని.. మరికొందరిలో విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ వ్యాధి చివరకు నరాల మీద ప్రభావం చూపి.. యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. నాడీవ్యవస్థ.. ఆపైన మెదడుపై ప్రభావం చూపుతోందని.. ఇదంతా 10-15 రోజుల వ్యవధిలో జరుగుతుందని చెప్పారు.


పిల్లలు, వృద్ధులపై ప్రభావం

జీబీఎస్‌ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతోంది. చాలా మంది చిన్నారులు తమకు వచ్చే అనారోగ్య సమస్యలను సృష్టంగా చెప్పలేరు. దాంతో.. చికిత్స సమయం దాటిపోయే ప్రమాదముంది. చిన్నారులకు ఇచ్చే పాలను బాగా వేడి చేసి, చల్లార్చి ఇవ్వాలని.. తాగునీటిని కూడా కాచి, చల్లార్చి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాకున్నా.. శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పలేమని, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కొవిడ్‌ సమయంలో మాదిరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.

ఇంజెక్షన్‌ ధర రూ.30 వేల వరకు

జీబీఎ్‌సకు అందించే వైద్యంలో ఉపయోగించే ఇమినో గ్లోబినిస్‌ థెరపీ ఇంజెక్షన్ల్‌ కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో దీన్ని రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read:

గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..

భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..

For More National News and Telugu News..

Updated Date - Feb 17 , 2025 | 01:59 AM