Nepal Unrest: ఫలించిన లోకేశ్ కృషి.. ఎట్టకేలకు స్వస్థలాలకు ఏపీ వాసులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:19 PM
నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. తొలి విడతగా భారత్‌లోని బీహార్ సరిహద్దుకు 22 మంది తరలింపునకు చర్యలు ప్రారంభమైనాయి.
అమరావతి, సెప్టెంబర్ 10: యువత నిరనసలు, ఆందోళనల నేపథ్యంలో నేపాల్ అట్టుడికిపోతుంది. దీంతో నేపాల్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలించింది. తొలి విడతగా భారత్‌లోని బీహార్ సరిహద్దుకు 22 మంది తరలింపునకు చర్యలు ప్రారంభమైనాయి. ఈ ఏపీ వాసులను ఈ సరిహద్దు ప్రాంతానికి తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక మిగిలిన వారిని గురువారం నేపాల్ నుంచి భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం నేపాల్ రాజధాని ఖాట్మాండూ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ఆర్టీజీఎస్ ద్వారా నేపాల్‌లోని తెలుగు వారిని గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం అమరావతిలో వెల్లడించారు. నేపాల్‌లో తెలుగువారి కోసం ఏపీ భవన్‌లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో మొత్తం 217 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఖాట్మాండ్ నుంచి గురువారం మధ్యాహ్నం వారిని స్వస్థలాలకు తీసుకు వస్తామన్నారు. నేపాల్‌లోని ఏపీ వాసులతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
ఈ సందర్భంగా నేపాల్‌లోని తెలుగు వారికి మంత్రి నారా లోకేష్ భరోసా కల్పించినట్లు వివరించారు. నేపాల్‌లో చిక్కుకు పోయిన తెలుగు వారిని తీసుకు వచ్చేందుకు ఆర్టీజీఎస్‌లో సీఎస్, ఉన్నతాధికారులతో నారా లోకేశ్ సమీక్షంచిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే అంశంపై ఏపీ భవన్ అధికారులతో సైతం మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిహార్ సరిహద్దులకు చేరుకున్న ఏపీ వాసులను ఢిల్లీకి తరలించి.. అటు నుంచి ఏపీలోని స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
నేపాల్ నుంచి విశాఖ.. అటు నుంచి కడపకు విమానం..
నేపాల్‌లో చిక్కుకు పోయిన తెలుగు వారిని తీసుకు వచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 220 సీట్లు కెపాసిటీ ఉన్న ఇండిగో విమానాన్ని ఢిల్లీలో స్టాండ్ బైగా ఉంచామని మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత వెల్లడించారు. ఇప్పటి వరకూ 217 మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నారని.. వారితో ఎప్పటికప్పడు మాట్లాడుతున్నామని చెప్పారు. వీరిలో 173 మంది ఖాట్మాండూలోనే ఉన్నారన్నారు. హితౌడాలో 22 మంది, పోక్ హరాలో 10 మంది, సిమికోట్ లో 12 మంది ఉన్నారని వివరించారు. వీరిని రప్పించేందుకు నేపాల్ ఆర్మీతో, బిహర్ అధికారులు, పౌర విమాన యాన శాఖ అధికారులతోపాటు ఢిల్లీ భవన్ అధికారులతో చర్చించామని చెప్పారు.
నేపాల్‌లో చిక్కుకున్న వారిలో విశాఖకు చెందిన 42 మంది, విజయనగరానికి చెందని 34 మంది, కర్నూలుకు చెందని 22 మంది ఉన్నారని.. మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. నేపాల్‌లో మొత్తం ఆర్మీ కంట్రోల్‌కు తీసుకుందన్నారు. గురువారం ఉదయం 6 గంటల వరకూ కర్పూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఖాట్మాండూ నుండి గురువారం మధ్యాహ్నం ఒక ప్లైట్ ద్వారా విశాఖకు, అక్కడి నుండి కడపకు తీసుకువస్తామని వివరించారు. నేపాల్‌లోని తెలుగు వారికి ఎటువంటి గాయాలు కాలేదన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
For More AP News And Telugu News