Share News

Ap Govt : ట్రైబ్యునల్‌-2పై స్టే కోరదాం

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:36 AM

కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Ap Govt : ట్రైబ్యునల్‌-2పై స్టే కోరదాం

  • 23న సుప్రీం కోర్టులో ఆ మేరకు విన్నవిద్దాం

  • కేంద్ర గెజిట్‌ను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాం

  • విభజన చట్టంలోని సెక్షన్‌ 89 రక్షణ కవచం

  • సెక్షన్‌-3పైన బలమైన వాదనలు వినిపిద్దాం

  • కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న సుప్రీంకోర్టులో జరిగే విచారణలో సదరు ఆదేశాలపై ‘స్టే’ కోరాలని సర్కారు నిర్ణయించింది. 2023లో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 23న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో వాదనలను బలంగా వినిపించడం ద్వారా బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌-2ను రద్దు చేయాలని కోరడం, లేదంటే స్టే విధించాలని పట్టుబడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, కేంద్ర మార్గదర్శకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాదనలను వినేందుకు బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌-2 కూడా సిద్ధమైంది. గురువారం దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు ట్రైబ్యునల్‌ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర గెజిట్‌ మేరకు సెక్షన్‌-3 కింద రాష్ట్రాల పిటిషన్లపై వాదనలు వింటామని స్పష్టం చేసింది. తర్వాత రాష్ట్ర విభజన చట్టం పరిధిలోని సెక్షన్‌ 89 పరిధిలోకి వచ్చిన ప్రాజెక్టులు, వాటికి కేటాయించిన కృష్ణా జలాలపై సమీక్షిస్తామని పేర్కొంది. కాగా, ట్రైబ్యునల్‌ సూచనలే తమకు విజయం దక్కేలా చేశాయని తెలంగాణ ప్రకటించుకుంది. కృష్ణా జలాల పంపకాలపై తమ వాదనలు నెగ్గాయని పేర్కొంది. అయితే.. సెక్షన్‌ 89 రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుందని.. ప్రాజెక్టులు లేకుండా కేవలం పరివాహక ప్రాంతంపై ఆధారపడి కేటాయింపులు ఉండవని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.


  • తెలంగాణ వాదన అసంబద్ధం: నిపుణులు

ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పెంచుతూ ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల కేటాయింపులపై పునఃసమీక్షించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఏపీ జల వనరుల నిపుణులు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించడం వల్ల తెలంగాణకు కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటా వస్తుందని తెలంగాణ చెప్పడాన్ని కూడా రాష్ట్ర జల వనరుల నిపుణులు తప్పుబడుతున్నారు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా తెలంగాణ గుర్తించలేకపోతోందని అంటున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 03:36 AM