Share News

Sports : ఇండోర్‌ స్టేడియానికి వైసీపీ గ్రహణం..!

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:36 AM

క్రీడాకారుల ఆశలపై గత వైసీపీ పాలకులు నీళ్లు చల్లారు. మండలంలోని కల్లూరు వాసులు పోరాటాల ద్వారా సాధించుకున్న ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని అటకెక్కించారు. ఐదేళ్లూ ఆ వైపు కూడా చూడలేదు. స్టేడియం స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేసే పరిస్థితి వచ్చిందంటే వైసీపీ ఏస్థాయిలో నిర్లక్ష్యం వహించిందో అర్థం చేసుకోవచ్చు. స్టేడియంలో కంపచెట్లు పెరిగిపోయాయి....

Sports : ఇండోర్‌ స్టేడియానికి వైసీపీ గ్రహణం..!
An unfinished indoor stadium in Kallur

నిర్మాణంపై ఐదేళ్లూ నిర్లక్ష్యం

ముందుకు కదలని పనులు

క్రీడాకారుల ఆశలపై నీళ్లు

గార్లదిన్నె, మార్చి 7(ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల ఆశలపై గత వైసీపీ పాలకులు నీళ్లు చల్లారు. మండలంలోని కల్లూరు వాసులు పోరాటాల ద్వారా సాధించుకున్న ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని అటకెక్కించారు. ఐదేళ్లూ ఆ వైపు కూడా చూడలేదు. స్టేడియం స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేసే పరిస్థితి వచ్చిందంటే వైసీపీ ఏస్థాయిలో నిర్లక్ష్యం వహించిందో అర్థం చేసుకోవచ్చు. స్టేడియంలో కంపచెట్లు పెరిగిపోయాయి.

టీడీపీ హయాంలో ప్రారంభం

పారిశ్రామిక వాడగా కల్లూరు పేరుగాంచింది. పంచాయతీలో సుమారు 20వేల జనాభా ఉంది. క్రీడాకారులు, వివిధ ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్నవారు, రిటైర్డ్‌ ఉద్యోగులు వ్యాయామాలు, వాకింగ్‌ చేసుకునేందుకు గ్రామంలో స్డేడియం లేదు. దీంతో వారందరూ 44వ జాతీయ రహదారిపైకి వెళ్తుంటారు. రహదారిపై వాహనాలు అతివేగంతో వస్తుండడంతో భయంభయంగా వెళ్తుంటారు. గతంలో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు కూడా. ఈ నేపథ్యంలో గ్రామంలో


ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తే వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. స్టేడియం కోసం క్రీడాకారులు గతంలో నిరహార దీక్షలు చేపట్టారు. స్పందించిన తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కల్లూరులో స్డేడియం నిర్మాణానికి ఉపక్రమించింది. కొండకింద కొట్టాల సమీపంలో స్థలాన్ని కేటాయించింది. స్టేట్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో అప్పట్లో ఇండోర్‌ స్టేడియం పనులను ప్రారంభించి, 30 శాతం పూర్తి చేశారు.

వైసీపీ నిర్లక్ష్యం

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని అటకెక్కించింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించలేదు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఐదేళ్లూ అటువైపు కూడా చూడలేదు. స్టేడియంలో కంపచెట్లు పెరిగిపోయాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు రియల్టర్లు.. స్టేడియం స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.

కూటమిపై ఆశలు

గతేడాది కూటమి అధికారంలోకి రావడంతో క్రీడాకారుల్లో ఆశలు రేగాయి. ఇండోర్‌ స్టేడియానికి మోక్షం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు, అధికారులు స్పందించి, ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించాలి

క్రీడాకారులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించాలి. కల్లూరులో చాలామంది క్రీడాకారులున్నారు. స్థానికంగా స్టేడియం లేక పామిడి, అనంతపురానికి వెళ్తున్నారు. ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తే స్థానికంగానే క్రీడలు ఆడుకోవచ్చు.

- చాంద్‌బాషా, కల్లూరు


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...

Updated Date - Mar 08 , 2025 | 12:36 AM