Share News

Houses of Jagananna : తవ్వేకొద్దీ అక్రమాలు..!

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:24 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ పథకం పేదలకు పెద్దగా ఉపయోగపడకపోయినా హౌసింగ్‌ ఇంజనీర్లకు మాత్రం జేబులు నింపింది. లబ్ధిదారుల ఎంపిక మొదలు నిర్మాణం, నిధుల చెల్లింపు, మెటీరియల్‌ సరఫరా వరకు అక్రమాల పుట్టగా మారింది. జిల్లాలోనే అత్యధికంగా ...

 Houses of Jagananna : తవ్వేకొద్దీ అక్రమాలు..!
Jagananna Colony in Raptadu

జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఇష్టారాజ్యం

ఇనుము, సిమెంట్‌ అక్రమ తరలింపు

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఇంజనీరు బాగోతం..

కలెక్టర్‌ వద్దకు చేరిన ఫైల్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ పథకం పేదలకు పెద్దగా ఉపయోగపడకపోయినా హౌసింగ్‌ ఇంజనీర్లకు మాత్రం జేబులు నింపింది. లబ్ధిదారుల ఎంపిక మొదలు నిర్మాణం, నిధుల చెల్లింపు, మెటీరియల్‌ సరఫరా వరకు అక్రమాల పుట్టగా మారింది. జిల్లాలోనే అత్యధికంగా మంజూరైన రాప్తాడు నియోజకవర్గంలో అక్రమాలు భారీగా జరిగాయి. రాప్తాడుకు 8,894 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో రూ.3కోట్ల వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స అధికారులు తేల్చారు. ఓ ఇంజనీరు ఇనుము, సిమెంటు అక్రమంగా విక్రయించి రూ.20లక్షలు స్వాహా చేయడంపై తాజాగా విచారణ చేపట్టారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపారు. అప్పట్లో రాప్తాడులో పనిచేసిన ఇంజనీరు ప్రస్తుతం అనంతపురానికి దగ్గరలో ఉన్న మరో నియోజకవర్గానికి బదిలీలపై వెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరుపై వేటు వేస్తారా లేక రికవరీ చేసి మందలించి వదిలేస్తారా అనేది ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా


మారింది.

వెలుగులోకి ఇంజనీరు బాగోతం

అనంతపురానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గంలో ఇనచార్జి డీఈగా పనిచేస్తున్న ఓ ఇంజనీరు చేసిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇంజనీరు పనిచేసిన స్థానంలో ఇప్పటికే విజిలెన్స విచారణ ఎదుర్కొని బదిలీ వేటు పడింది. ఈ క్రమంలో మరో అవినీతి ఘటన వెలుగుచూసింది. ఇదే విషయంపై అంతర్గతంగా విచారణ చేసి విచారణ అధికారి కలెక్టర్‌ వద్దకు ఫైల్‌ చేర్చారు. ఇనుము, సిమెంట్‌ సుమారు రూ.20లక్షల వరకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. గతంలో కూడా ఆ ఇంజనీరు రూ.50 లక్షలకు పైగా నిధులు స్వాహా చేసిన వ్యవహారాన్ని విజిలెన్స విచారణలో తేల్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విజిలెన్స విచారణ జరిగి 24 మంది ఇంజనీర్లపై సస్పెన్షన వేటు పడింది.

రాప్తాడులోనే అధికంగా అక్రమాలు

జగనన్న కాలనీల అక్రమాల్లో అత్యధికంగా రాప్తాడులోనే వెలుగుచూశాయి. దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. స్పందించిన హౌసింగ్‌ అధికారులు మరోసారి విజిలెన్స విచారణ చేపట్టాలని సూచించినట్లు సమాచారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సేవలో మునిగితేలిన హౌసింగ్‌ ఇంజనీర్లు చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావంటున్నారు ఆశాఖలో ఉద్యోగులు. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ పరిధిలోని నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరిగిన అక్రమాలపై కొందరు ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.3కోట్ల వరకు అక్రమంగా బిల్లులు చేసినట్లు ఇంతకు ముందే విజిలెన్స విచారణలో గుర్తించారు. అవే అక్రమాలపై మరోసారి విజిలెన్స విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం లేకపోలేదు.

ఫిర్యాదులపై విచారణ చేయిస్తాం

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తాం. గతంలోనే విజిలెన్స విచారణ జరిగింది. తాజాగా చేసిన విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపాం. సిమెంటు, ఇనుము విక్రయాలపై విచారణ చేయించాం. ప్రభుత్వం నుంచి వచ్చిన స్టాక్‌, లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్టాక్‌కు తేడా వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తాం.

-శైలజ, పీడీ, గృహ నిర్మాణశాఖ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Feb 27 , 2025 | 01:24 AM