Satish Kumar Death: సతీశ్ కుమార్ మృతిపై సీన్ రీకన్‌స్ట్రక్షన్..
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:55 PM
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆదివారం నాడు సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగింది. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్(22157) రైలులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
అనంతపురం, నవంబర్ 16: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (22157) రైలులో ఆదివారం పోలీసులు మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. గుత్తి రైల్వేస్టేషన్ వద్ద మనిషి రూపంలో ఉన్న మూడు బొమ్మలను ట్రైన్‌లోకి ఎక్కించారు. అనంతరం వాటిని ఫస్ట్ క్లాస్, టు టైర్, త్రీ టైర్ బోగిల్లోని డోర్ల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ మృతదేహం పడిన ప్రదేశం రాగానే వాటిని రైలు నుంచి తోసేశారు. ట్రైన్‌లో నుంచి కిందపడిన బొమ్మలు ఎన్ని మీటర్ల దూరంలో పడిపోయాయనే విషయాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ మొత్తం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పర్యవేక్షణలో ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2023 ఏప్రిల్‌లో టీటీడీ పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా అప్పటి ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ పట్టుకున్నారు. దీంతో హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీశ్ ఫిర్యాదు చేశారు. అనంతరం కొన్ని కారణాల వల్ల ఈ చోరీ కేసు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై జర్నలిస్ట్ ఎం. శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే, నవంబర్ మొదటి వారంలో ఒకసారి సతీశ్ ఈ విచారణకు హజరయ్యారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
శుక్రవారం విచారణకు హాజరయ్యేందుకు ఆయన గుంతకల్లు నుంచి గురువారం రాత్రి ట్రైన్‌లో విజయవాడకు బయలుదేరారు. ఉదయానికి ఆయన విజయవాడకు చేరుకుని ఉంటారని సతీశ్ ఫ్యామిలీ భావించింది. కానీ ఆయన తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శవమై కనిపించాడు. దీంతో అతడి కుటుంబం షాక్‌కు గురైంది. సతీశ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే సతీశ్‌ది హత్యా?, సాధారణ మరణమా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. సతీశ్ మరణంపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్
For More AP News And Telugu News