Theft : రాములోరి సొమ్ము చోరీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:24 AM
సొల్లాపురంలో రామాలయ నిర్మాణం కోసం సిద్ధం చేసుకున్న రూ.12 లక్షల నగదును సోమవారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు కణేకల్లు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగమధుకు ...

కణేకల్లు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సొల్లాపురంలో రామాలయ నిర్మాణం కోసం సిద్ధం చేసుకున్న రూ.12 లక్షల నగదును సోమవారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు కణేకల్లు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగమధుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామస్థులు రూ.4 కోట్లకు పైగా చందాలు వేసుకున్నారు. గ్రామ పెద్ద లక్ష్మణ్ చౌదరి వద్ద ఈ మొత్తాన్ని ఉంచి ఖర్చు చేస్తున్నామని వారు తెలిపారు. రెండు రోజుల క్రితం గ్రామస్థులు కొందరు
తమ వాటాగా ఇచ్చిన రూ.12 లక్షలను లక్ష్మణ్ చౌదరికి ఇచ్చామని తెలిపారు. ఆయన సోమవారం అనంతపురం వెళ్లారని, అర్ధరాత్రి ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి నగదును ఎత్తుకుపోయారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి గ్రామంలోని హనకనహాళ్‌లో రోడ్డులో ఉన్న లక్ష్మణ్‌చౌదరి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకి వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....