Share News

MLA Daggupati : అధ్యక్షా.. తొలిసారి మీ ద్వారా..!

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:47 AM

అనంత ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన డంపింగ్‌ యార్డును మరో చోటకు తరలించేందుకు స్థలం కేటాయించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రభుత్వానికి విన్నవించారు. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో గళం విప్పిన ఆయనకు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. అక్టోబరు 2 నాటికి డంపింగ్‌ యార్డును తరలిస్తామని ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని ...

 MLA Daggupati : అధ్యక్షా.. తొలిసారి మీ ద్వారా..!

డంపింగ్‌ యార్డుకు స్థలం కేటాయించండి

అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే దగ్గుపాటి

అక్టోబరు 2లోపు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ

అనంతపురం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అనంత ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన డంపింగ్‌ యార్డును మరో చోటకు తరలించేందుకు స్థలం కేటాయించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రభుత్వానికి విన్నవించారు. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో గళం విప్పిన ఆయనకు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. అక్టోబరు 2 నాటికి డంపింగ్‌ యార్డును తరలిస్తామని ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గురువారం తొలిసారి గళం విప్పారు. ప్రజల వాణిని వినిపించారు. నగరానికి అతిపెద్ద సమస్యగా మారిన డంపింగ్‌ యార్డు గురించి మాట్లాడారు. నగర జనాభా 4.90 లక్షలు కాగా, ఏటా 2.05 శాతం పెరుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.


అనంతపురం అర్బన నియోజకవర్గంలో 50 నగరపాలక డివిజన్లు, నాలుగు పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నగర శివారులో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారని అన్నారు. నగరం విస్తరించిన నేపథ్యంలో డంపింగ్‌ యార్డు కాలనీల మధ్యకు చేరిందని అన్నారు. చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రోగాల బారిన పడుతున్నారని అన్నారు. డంపింగ్‌ యార్డు బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారికి ఆనుకుని ఉందని, దాన్నుంచి వచ్చే పొగ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. డంపింగ్‌ యార్డును తరలించేందుకు దాదాపు 50 ఎకరాల స్థలం అవసరమని, ఆ మేరకు స్థలం కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి స్పందించారు. అక్టోబరు 2 నాటికి 50 ఎకరాల స్థలం సేకరిస్తామని, డంపింగ్‌ యార్డును మార్చి ప్రజలకు ఆ బాధల నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నారాయణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...


Updated Date - Mar 07 , 2025 | 12:47 AM