Share News

Healh : మెడికిల్‌ షాపులు..!

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:43 AM

కొందరు మెడికల్‌ షాపు నిర్వాహకులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యుల చీటీ లేకుండానే జనాలకు మందులు ఇస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలంచెల్లిన మందులు, స్టెరాయిడ్స్‌ విచ్చలవిడిగా అంటగడుతున్నారు. ...

Healh : మెడికిల్‌ షాపులు..!

ప్రజల ప్రాణాలతో చెలగాటం

డాక్టర్‌ చీటీ లేకుండానే మందులు ఇస్తున్న వైనం

కాలంచెల్లినవి, స్టెరాయిడ్స్‌ అంటగడుతున్న వైనం

కళ్యాణదుర్గం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కొందరు మెడికల్‌ షాపు నిర్వాహకులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యుల చీటీ లేకుండానే జనాలకు మందులు ఇస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలంచెల్లిన మందులు, స్టెరాయిడ్స్‌ విచ్చలవిడిగా అంటగడుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఓ మండలం స్టెరాయిడ్స్‌ విక్రయాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాటిని వేసుకున్న జనం ప్రాణాపాయంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇదంతా పబ్లిక్‌గానే సాగుతున్నా.. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.


డిస్కౌంట్లతో ఆకర్షణ

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 40కి పైబడి మెడికల్‌ షాపులున్నాయి. వీటిలో 30 షాపులకు లైసెన్సు ఉంది. మిగిలిన 10 అనుమతులు లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్సు ఒకరి పేరు మీద ఉంటే, మరొకరు మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆయా ప్రాంతాన్ని బట్టి రోజుకు ఒక్కో షాపులో రూ.20 వేల నుంచి రూ.లక్షలకుపైగా వ్యాపారం సాగుతోంది. ఇటీవల మెడికల్‌ షాపుల్లో కొన్ని మందులపై డిస్కౌంట్‌ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. కొంతకాలం కస్టమర్లను ఆకర్షించేందుకు ధరలపై 30 శాతం డిస్కౌంట్‌ అని బోర్డులు పెడతారు. రానురాను బోర్డు అలాగే ఉన్నా.. డిస్కౌంట్‌ తగ్గిపోతుంటుంది. కళ్యాణదుర్గంలో కొన్ని మెడికల్‌ షాపుల్లో అన్ని రకాల మందులపై 20 నుంచి 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఇతర దుకాణదారులు.. వారిపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. 30 శాతం ప్రకటించిన దుకాణదారుడు ఇప్పుడు 20 శాతం మాత్రమే డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

డాక్టర్‌ చీటీ లేకుండానే...

దగ్గు, జలుబు, సాధారణ జ్వరానికి మెడికల్‌ షాపుల్లో మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యజమానులు చిత్తు కాగితాల్లో ధరలు వేస్తున్నారు. రోగులు అడగ్గానే మెడికల్‌ షాపుల నిర్వాహకులు ప్రాణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్‌ చీటీ లేకుండానే. డాక్టర్‌ ఒక మాత్ర రాస్తే మెడికల్‌ షాపుల్లో మరొకటి ఇచ్చి అదే కాంబినేషన అని చెబుతారు. కాంబినేషన ఒకటే అయినా.. అది తక్కువ ధర, ఎక్కువ కమీషన ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

మెడికల్‌ షాపుల నిర్వాకాల్లో కొన్ని..

  • కళ్యాణదుర్గంలో ఒక యువతి అవాంఛిత గర్భం దాల్చడంతో మెడికల్‌ షాపు నిర్వాహకుడిని ఆశ్రయించింది. ఇదే అదునుగా గర్భనిరోధక మాత్రలను రూ.550కి విక్రయించారు. ఆ మాత్రలు వేసుకున్నాక అధిక రక్తస్రావమై, యువతి ఆస్పత్రి పాలైంది.

  • కళ్యాణదుర్గం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చిన్న జబ్బుకు మాత్రలు అడగ్గా.. పట్టణంలోని ఓ వ్యా పారి నాలు గు రకాల మందులు ఇచ్చాడు. వాటిని వినియోగించిన వ్యక్తి రెండ్రోజులకే తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పరిశీలించగా.. అవి కాలం చెల్లిన మందులుగా తేలింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు.. షాపు నిర్వాహకుడితో ఘర్షణకు దిగారు. విషయం బయటకు పొక్కకుండా దుకాణ యజమాని రూ.10 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది.

  • నియోజకవర్గంలోని ఓ మండలంలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్‌ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలా వేసుకున్న.. స్టెరాయిడ్‌ ఓ రోగి ప్రా ణాల మీదకు తెచ్చింది. చివరకు అనంతపురం వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇదే మండలంలోని ఓ మెడికల్‌ షాపులో సూది వేసి, మందులు కూడా ఇస్తున్నారు. ప్రతి జబ్బుకు సెలైన బాటిల్‌ పెట్టి, ఒక్కో రోగి నుంచి రూ.200 నుంచి రూ.500దాకా గుంజుతున్నారు. మండలం.. స్టెరాయిడ్స్‌కు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిపోయి ందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తనిఖీలు చేస్తున్నాం

మెడికల్‌ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. మందుల విక్రయాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. కాలంచెల్లిన మందులు విక్రయిస్తున్నా, రికార్డులు సక్రమంగా లేకపోయినా చర్యలు తప్పవు. అనుమతులు కూడా రద్దు చేస్తాం.

-హనుమన్న, డ్రగ్‌ ఇనస్పెక్టర్‌, అనంతపురం


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...


Updated Date - Mar 07 , 2025 | 12:43 AM