Super six : మహా వేడుక
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:13 AM
చారిత్రక ఘట్టానికి అనంతపురం సిద్ధమైంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా 3.50 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే మహాయజ్ఞం పూర్తి అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నాయకులు నగరంలో తిష్ట వేసి.. చక చకా ఏర్పాట్లు చేయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలలో చాటిన ఐక్యతను హామీల అమలులో కొసాగించారు. కేవలం 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేసి.. సగర్వంగా జనం ఎదుటకు వస్తున్నారు అగ్ర నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ...
-నేడు అనంతలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ
-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ రాక
-రాష్ట్రం నలుమూలల నుంచి 3.5 లక్షల మంది జనం..
- అనంతకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
- తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నాయకులు
- ప్రజల కోసం 3,550 ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ఏర్పాటు
- పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఉమ్మడి జిల్లా విద్యాశాఖ
- 650 సీసీలు, 55 డ్రోన కెమెరాలతో నిఘా
- కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలి: ఎస్పీ జగదీష్
అనంతపురం క్రైం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): చారిత్రక ఘట్టానికి అనంతపురం సిద్ధమైంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా 3.50 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే మహాయజ్ఞం పూర్తి అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నాయకులు నగరంలో తిష్ట వేసి.. చక చకా ఏర్పాట్లు చేయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలలో చాటిన ఐక్యతను హామీల అమలులో కొసాగించారు. కేవలం 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేసి.. సగర్వంగా జనం ఎదుటకు వస్తున్నారు అగ్ర నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మూడు పార్టీల కీలక నాయకులు ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభకు వస్తున్నారు. ఈ వేడుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జన తరంగాన్ని కలిపే మహా వేదిక శరవేగంగా రూపుదిద్దుకుంది. అధికారం చేపట్టింది మొదలు గడిచిన 15 నెలల్లో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను తమ అధినేతలు ప్రజలకు వివరిస్తుంటే చూడాలని మూడుపార్టీల శ్రేణులు ఉత్సాహంగా
ఎదురు చూస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభను బుధవారం నిర్వహిస్తున్నారు. అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీ జీఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్స్ ఇందుకు సిద్ధమైంది. మంత్రులు, మూడు పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, ఎంపీలు, ఇతర అగ్రనాయకులు బుధవారం వస్తున్నారు. బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ కొనసాగుతుంది.
ఇలా వెళ్లి.. అలా నిలపండి..
- ఉరవకొండ నియోజవర్గం నుంచి వచ్చే వాహనాలు కూడేరు మీదుగా బళ్లారి బైపాస్, తపోవనం సర్కిల్ నుంచి హైవే మీదుగా ప్రయాణించి.. విజయోత్సవ సభకు సమీపంలో కేటాయించి ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో పార్కింగ్ చేసుకోవాలి.
- రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు ఆత్మకూరు మీదుగా కళ్యాణదుర్గం బైపాస్ అండర్ పాస్, సర్వీస్ రోడ్డులో వచ్చి రవి పెట్రోల్ బంకు వద్ద హైవేలో ప్రవేశించి, సభ వద్దకు చేరుకుని, సమీపంలోని ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో పార్కింగ్ చేసుకోవాలి.
- గుత్తి, గుంతకల్లు వైపు నుంచి వచ్చే వాహనాలను గార్లదిన్నె మీదుగా హైవేపై సభ వద్దకు వచ్చి, ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో పార్కింగ్ చేయాలి.
-తాడిపత్రి నియోజవకర్గం నుంచి వచ్చే వాహనాలు నాయనపల్లి క్రాస్ మీదుగా 544-డి జాతీయ రహదారిపై ప్రవేశించి, వడియంపేట, నేషనల్ పార్కు వద్ద జాతీయ రహదారి 44లో ప్రవేశించి, సభ వద్దకు చేరుకుని.. ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో చేసుకోవాలి.
- శింగనమల నియోజవర్గం నుంచి వచ్చే వాహనాలు బుక్కరాయసముద్రం, చెరువుకట్ట, కలెక్టర్ కార్యాలయం, పంగల్ రోడ్డు, రాప్తాడు వై జంక్షన మీదుగా సభకు చేరుకోవాలి. సమీపంలోని కేటాయించిన ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో పార్కింగ్ చేయాలి.
- కదిరి, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి నుంచి వచ్చే వాహనాలు సేతు స్కూల్ సమీపంలో.. రాప్తాడు వై జంక్షన మీదుగా సభకు చేరుకోవాలి. వీళ్లు కూడా ప్రసన్నాయపల్లి, అయ్యవారిపల్లి రోడ్లలో పార్కింగ్ చేసుకోవాలి.
ఇబ్బందుల్లేకుండా సూపర్ హిట్ చేయాలి
- మంత్రి మండిపల్లి,
ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు
అనంతపురం టౌన(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ఆదేశించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం వారు కలెక్టర్ వినోద్‌కుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇతర జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల రవాణా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, భోజన వసతి ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలను సభకు చేర్చే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో ఉండేలా చూడాలన్నారు. అలాగే సభ ముగిసిన అనంతరం ప్రయాణికులను వారి స్వస్థలాలకు క్షేమంగా చేర్చేవరకు పర్యవేక్షించాలన్నారు.
సర్వం సిద్ధం
‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలి రా హిట్ పట్టాలి’ అంటూ బుధవారం జరిగే సభకు సర్వం సిద్ధం చేశారు. సుమారు 50 ఎకరాల్లో భారీ బహిరంగ వేదిక, ప్రజలు కూర్చోడానికి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో తాత్కాలిక విశ్రాంతి కోసం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు కోసం మూడు భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. సభాప్రాంగణంతోపాటు, సభాస్థలికి వెళ్లే రహదారులు, గ్యాలరీల్లో క్షణ క్షణం పర్యవేక్షించానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
వచ్చేశారు.. కీలక నాయకులు
టీడీపీ కూటమి నేతల పండుగ సూపర్‌సిక్స్-సూపర్‌హిట్ సభలో పాల్గొనేందుకు అగ్రనాయకులు, అమాత్యులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రులు రామ్మోహననాయుడు, పెమ్మసారి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, సత్యప్రసాద్, మాజీ మంత్రులు, సుమారు 80 మంది వరకూ ఎమ్మెల్యేలు అనంతపురం చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో నగరంలోని లాడ్జులు, హోటళ్లు, ఫంక్షన హాళ్లు, కల్యాణ మండపాలు కిటకిటలాడుతున్నాయి.
సహకరించాలి: ఎస్పీ
సీఎం, డిప్యూటీ సీఎం, ప్రముఖల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా అందరూ సహకరించాలని ఎస్పీ జగదీష్ కోరారు. వాహనదారులకు సూచించిన చోట పార్కింగ్ చేయాలని కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాల నుంచి అనంతపుర నగరానికి వచ్చే వేలాదిమంది వాహనదారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.
నిఘా నీడలో నగరం
బహిరంగ సభకు లక్షలాది మంది తరలివస్తున్నందున పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనుంది. మొత్తం 55 డ్రోన కెమెరాలతో సభ భద్రతను పర్యవేక్షిస్తారు. మరో 250 సీసీ కెమెరాలతో సభా ప్రాంగణంలో అనుక్షనం నిఘా పెట్టనున్నారు. వీటికితోడు మరో 400 సీసీ కెమెరాలతో నగరం మొత్తం నిఘా వేశారు. వేలాది మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.