Share News

UPADHI : ఉపాధి నిధులు స్వాహా..!

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:18 AM

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి నిధులను భారీ మొత్తంలో కాజేశారు. అప్పట్లో వైసీపీ నాయకుల అండదండలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి, పనులకు హా జరుకాకపోయినా బిల్లులు స్వాహా చేశారు. పలు అక్రమాలు ప్రజావేదికలో వెల్లడయ్యాయి.

UPADHI : ఉపాధి నిధులు స్వాహా..!
Dwama PD Salimbasha and other officials participated in the public forum

- వెసీపీ ప్రభుత్వంలో నిర్వాకం

- పనులకు వెళ్లకున్నా, మొక్కలు లేకున్నా బిల్లులు

  • రూ. 4.77 లక్షలు రికవరీకి ఆదేశం

రాప్తాడు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి నిధులను భారీ మొత్తంలో కాజేశారు. అప్పట్లో వైసీపీ నాయకుల అండదండలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి, పనులకు హా జరుకాకపోయినా బిల్లులు స్వాహా చేశారు. పలు అక్రమాలు ప్రజావేదికలో వెల్లడయ్యాయి. మండలంలో ఉపాఽధి నిధులు స్వాహాచేసిన విషయం ప్రభుత్వం 17వ విడుత నిర్వహించిన సామాజిక తనిఖీలో బట్టబయలైంది. 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్‌ వరకూ రూ. 11. 24 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ చేపట్టారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామా పీడి సీలీంబాషా, అడిషినల్‌ పీడీ సుధాకర్‌రెడ్డి, ఏపీడీ చెన్నకేశవులు సమక్షంలో గ్రామాల్లో చేసిన ఉపాధి పనులు, వాటిలో జరిగిన అవకతవకలను సామాజిక తనిఖీ బృందం వివరించారు. ఇందులో గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు వివిద పనుల్లో చేతి వాటం ప్రదర్శించినట్లు తేలింది. గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లక పోయినా పనులకు హాజరైనట్లు మస్టర్లలో నమోదు చేసి బిల్లులు చేసుకున్నారు. అనంతపురం, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు గ్రామాల్లో నకిలీ జాబ్‌కార్డులు సృష్టించి వారు పనులకు వెళ్లినట్లు బిల్లులు చేసుకున్నారు.


ఎన్నో ఏళ్ల కిందట గ్రామాల నుంచి వలసలు వెళ్లిన వారి పేరిట బిల్లులు నమోదు చేశారు. వలంటీర్ల పేరు మీద కూడా బిల్లులు న మోదు చేశారు. కొన్ని గ్రామాల్లో మామిడి, చీనీ మొక్కలు లేకపోయినా బి ల్లులు చేశారని సామాజిక తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. ప్రసన్నాయ పల్లిలో రూ. 5,500, బొమ్మేపర్తిలో రూ. 1.78 లక్షలు, మరూరులో రూ. 24 వేలు, రాప్తాడులో రూ. 68 వేలు, బోగినేపల్లిలో రూ. 1,288, చెర్లోపల్లిలో రూ. 6,754, యర్రగుంటలో రూ. 798, బండమీదపల్లిలో రూ. 13,572, కొత్తపల్లిలో రూ. 1.63 లక్షలు, పాలచెర్లలో రూ. 14 వేలు అవినీతి జరిగినట్లు తెలిపారు. మండలం మొత్తం ఉపాధి పనుల్లో రూ. 4.77 లక్షలు అవినీతి జరిగిందని అధికారులు రికవరీకి ఆదేశించారు. అందరు ఫీల్డ్‌ అసిస్టెంట్ల రికార్డులు సక్ర మంగా నమోదు చేయకపోవడం వలన వారికి రూ. 22 వేలు జరిమానా విధించారు. బొమ్మేపర్తి, కొత్తపల్లిల్లో ఎక్కువగా అవినీతి జరిగిందని అధికారు ల తనిఖీలో తేలింది. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఉపాధి పనుల్లో మరింత ఎక్కువగా అవినీతి జరగగా...ఆ అవినీతి బయటపడకుండా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు మేనేజ్‌ చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల గైర్హాజరు

సామాజితక తనిఖీ ప్రజావేదిక బహిరంగ సభకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలి. వారు చేయించిన పనులకు ఉన్నతాధికారుల వద్ద సమాధానం చెప్పాలి. అయితే ప్రజావేదికకు మండలంలోని 16 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు హాజరకావాల్సి ఉండగా, నలుగురు మాత్రమే వచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఓలు సావిత్రి, ఓబన్న, ఈసీ మురళి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 05 , 2025 | 12:18 AM