Sri Satya Sai District: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం..
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:20 PM
ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.

పుట్టపర్తి, జూన్ 10: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దళిత బాలికపై గత రెండేళ్లుగా 13 మంది అత్యాచారం చేస్తున్న ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో మైనర్ల నుంచి 50 ఏళ్ల పైబడిన వ్యక్తులు వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రామగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో దళిత వర్గానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. సదరు బాలికపై రెండేళ్లుగా కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేస్తున్నారు. ఆ క్రమంలో సదరు బాలిక తల్లిదండ్రులు.. పంచాయితీ కోసం గ్రామపెద్దల వద్దకు వెళ్లారు. దీంతో వారు సైతం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఆ తర్వాత చిన్నారి కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొండగుట్టల్లో దాచారు. ఈ వ్యవహారం కాస్తా వెలుగులోకి రావడంతో రామగిరి పోలీసులు ఆరా తీశారు. అనంతరం దళిత బాలిక కుటుంబం జాడ కనిపెట్టి.. అనంతపురంలోని సత్య కేంద్రానికి వారిని తరలించారు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. నిందితులపై ఫోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని.. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రత్న వివరించారు.
ఇక ఈ అత్యాచార ఘటనను నిందితులు వీడియో సైతం తీశారని తెలిపారు ఎస్పీ. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించామన్నారు. బాలికకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అచ్చంపల్లి వద్ద నిందితులు తలారి మురళి, పడగొల్లు నందవర్ధన్, నాగరాజు, సంజీవ, రాజన్న, రంగన్నను అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. మిగిలిన నిందితులను సైతం సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్
ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Read latest AP News And Telugu News