Dumpyard : బయోమైనింగ్‌కు బ్రేక్
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:31 AM
గుత్తి రోడ్డు సమీపాన చెత్త దిబ్బలను నగర వాసులు బెంబేలెత్తేవారు. ఆ రోడ్డున వెళ్లాలంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏళ్లుగా గుట్ట పెరుగుతూనే ఉంది. వైసీపీ పానలలో ఐదేళ్లూ తరలిస్తామని చెప్పడం తప్ప.. ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే చెత్త దిబ్బ తరలింపునకు చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి, బయోమైనింగ్‌కు శ్రీకారం ...
మట్టి ఎరువు తరలింపునకు ఆటంకాలు
ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిల్వకు స్థానికుల అభ్యంతరం
20వేల టన్నుల చెత్త మాత్రం వేరు చేసిన యంత్రాలు
ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా?
దృష్టి సారించని పాలకులు, అధికారులు
గుత్తి రోడ్డు సమీపాన చెత్త దిబ్బలను నగర వాసులు బెంబేలెత్తేవారు. ఆ రోడ్డున వెళ్లాలంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏళ్లుగా గుట్ట పెరుగుతూనే ఉంది. వైసీపీ పానలలో ఐదేళ్లూ తరలిస్తామని చెప్పడం తప్ప.. ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే చెత్త దిబ్బ తరలింపునకు చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి, బయోమైనింగ్‌కు శ్రీకారం చుట్టింది. దీంతో నగర వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. త్వరలో సమస్య పూర్తిగా తరలిపోతుందని సంబరపడ్డారు. కొన్ని రోజులు గడిచాయో... లేదో.. బయోమైనింగ్‌కు బ్రేక్ పడింది. అధికారుల అనాలోచిత నిర్ణయం సమస్యను తెచ్చిపెట్టింది. వారం రోజులుగా బయోమైనింగ్ ఆగిపోయినా..
పట్టించుకునే వారు కరువయ్యారని నగర వాసులు వాపోతున్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక గుత్తి రోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డులో చేపట్టిన బయోమైనింగ్‌కు బ్రేక్ పడింది. వేరు చేసిన చెత్తను తరలించడానికి పరిస్థితులు సానుకూలంగా లేనందున బయోమైనింగ్‌ను నిలిపేశారు. వారం రోజులుగా మిషన్లను పూర్తిగా ఆపేశారు. బయోమైనింగ్ ఆలస్యం అవుతుండడంతో చెత్తదిబ్బ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏళ్లుగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆశలు.. అడియాసలవుతున్నాయి. ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పబ్లిక్‌హెల్త్, అనంత నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం అడ్డుగా నిలుస్తోంది. బయోమైనింగ్ ద్వారా వేరుచేసిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు ఫ్యాక్టరీలు, గట్టిగా ఉండే రాళ్లు, రప్పలను రోడ్ల నిర్మాణానికి, మట్టిఎరువును పార్కులు, పొలాలకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. మట్టి ఎరువును తరలించేందుకు నగరంలో మూడు స్థలాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు అడ్డుకుంటున్నారు. పబ్లిక్‌హెల్త్, నగర పాలక సంస్థ అధికారులు ప్రణాళికాబద్ధంగా స్థలాన్ని ఎంపిక చేయకపోవడమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను క్లియర్ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రోజుకు 6వేల టన్నుల చెత్త బయోమైనింగ్ చేయాలని నిర్ణయించినా... 20రోజులు గడిచినా 20వేల టన్నుల చెత్తను మాత్రమే క్లియర్ చేశారు. వర్షం కురవడంతో బయోమైనింగ్ చేపడుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారింది.
కొరవడిన సమన్వయం
నగర పాలక సంస్థలో పారిశుధ్యం, మంచినీటి సరఫరాతో పాటు చెత్త బయోమైనింగ్ బాధ్యతలు పబ్లిక్ హెల్త్ అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లుగా నగరవాసులు ఎదుర్కొంటున్న డంపింగ్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా... ప్రతిష్టాత్మకంగా చెత్తను బయోమైనింగ్ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కేరళకు చెందిన జిగ్మా సంస్థకు రూ.12.68 కోట్లకు కాంట్రాక్టు అప్పగించింది. 168 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేయడం ప్రారంభించారు. 20రోజులు కావస్తున్నా 20వేల టన్నుల చెత్త మాత్రమే బయోమైనింగ్ చేశారు. రోజుకి 6వేల టన్నుల చెత్తను బయోమైనింగ్ చేస్తామని చెప్పిన సంబంధిత కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేస్తున్న ట్లు కనిపిస్తోంది. మొదట 3 మిషన్లతో బయోమైనింగ్ ప్రారంభించిన సంబంధిత సంస్థ ప్రస్తుతం ఐదింటితో చేస్తోంది. ఫలితం మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం గమనార్మం. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంత నగరపాలక సంస్థ, పబ్లిక్‌హెల్త్ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ బయోమైనింగ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. రోజూ బయోమైనింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదించాలి. నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ అధికారులు ఆ ఊసే పట్టించు కోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అడ్డుకున్న స్థానికులు
డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ద్వారా వేరు చేసిన చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, మట్టిఎరువు, రాయిరప్పలను మూడు భాగాలుగా విభజించారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలు, రాయిరప్పలను రోడ్డు నిర్మాణాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మట్టి ఎరువును పార్కుల ఏర్పాటు, ఇతర సుందరీకరణకు ఉపయోగించాలనుకున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే రైతుల పంట పొలాలకు తరలించాలని యోచిస్తున్నారు. మట్టిఎరువును పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు సైతం పంపారు. వేరుచేసిన మట్టిఎరువును నగరంలోని ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు తరలింపును ప్రారంభించారు. స్థానికులు అడ్డుకున్నారు. హెచ్చెల్సీకి సంబంధించిన స్థలంలో కాలువ పక్కనే నిల్వ చేయాలని చూసినా.. హెచ్చెల్సీ అధికారులు నిరాకరించారు. బిందెల కాలనీలోని ఓ ప్రైవేటు స్థలంలో యజమాని అనుమతితో మట్టి ఎరువును నిల్వ చేస్తుండగా.. అక్కడ కూడా స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్బందులు లేకుండా స్థలాన్ని ఎంపిక చేసి, మట్టిఎరువు తరలింపును సజావుగా సాగించాల్సిన నగరపాలక సంస్థ, పబ్లిక్‌హెల్త్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయం చూస్తున్నాం..
బయోమైనింగ్ ద్వారా వేరుచేసిన మట్టి ఎరువును తరలించేందుకు నగరంలో మూడు స్థలాలను ఎంపిక చేసినా.. ఫలితం లేదు. అన్నిచోట్లా స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో బయోమైనింగ్ పనులు నిలిపివేశారు. మట్టిఎరువు తరలింపునకు అనువైన స్థలం చూపాలని నగరపాలక సంస్థ అధికారులకు లేఖ రాశాం. స్థలం చూపిన వెంటనే బయోమైనింగ్ పనులు పునఃప్రారంభిస్తాం.
-ఆదినారాయణ, పబ్లిక్‌హెల్త్, అనంతపురం డివిజన ఈఈ
ఉచితంగా మట్టి ఎరువు
అనంత నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ద్వారా వేరుచేసిన మట్టి ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తున్నట్లు అనంత నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి బుధవారం ప్రకటనలో తెలిపారు. డంపింగ్ యార్డులో 1.68 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేస్తున్నారన్నారు. తద్వారా సుమారు 1.30 లక్షల మెట్నిక్ టన్నుల మట్టి ఎరువు ఉత్పత్తి అవుతుందన్నారు. ఆ ఎరువు మొక్కలు, వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆహారేతర పంటల పెంపకానికి మట్టి ఎరువును ఉపయోగించవచ్చన్నారు. ఉచితంగా తీసుకెళ్లేందుకు వచ్చినా అందిస్తామని తెలిపారు. వివరాలకు 9849907389 నంబరులో సంప్రదించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...