Anantapur: గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. పట్టుకోబోయిన సీఐపై దారుణం
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:07 PM
అనంతపురం జిల్లాలోని అరవింద్ నగర్ అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు స్నేహితుల మధ్య గొడవ చెరలేగింది. గంజాయి మత్తులో రాజు అనే యువకుడిపై అజయ్‌తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతపురం, డిసెంబర్ 22: జిల్లాలో టూటౌన్ సీఐపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో యువకులు దాడి చేసుకోగా.. వారిని పట్టుకోడానికి వెళ్లిన సీఐపైన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సీఐ సదరు వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే...
అనంతపురం జిల్లాలోని అరవింద్ నగర్ అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు స్నేహితుల మధ్య గొడవ చెరలేగింది. గంజాయి మత్తులో రాజు అనే యువకుడిపై అజయ్‌తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్.... నిందితుడు అజయ్‌ను పట్టుకునేందుకు ఇటుకలపల్లికి వెళ్లారు. తనను పట్టుకోవడానికి వచ్చిన సీఐపై కూడా అజయ్ కత్తితో దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో అజయ్‌పై సీఐ శ్రీకాంత్ కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కత్తి దాడిలో గాయపడిన సీఐ శ్రీకాంత్ పాటు పాటు కాల్పుల్లో గాయపడిన అజయ్ అనే యువకుడిని కూడా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌ను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై సీఐను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న (ఆదివారం) రాత్రి అరవింద నగర్‌లో నలుగురు స్నేహితులు మద్యం మత్తులో గొడవ పడ్డారని తెలిపారు. రాజా, సోహెల్, అక్రమ్ నిందితుడు అజయ్ మద్యం తాగి గొడవ చేసుకున్నారని.. నిందితుడు అజయ్ తన స్నేహితుడైన రాజాపై కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. దాడిలో రాజాకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు.
ఈ వ్యవహారంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు నమోదు చేసుకొని నిందితుడు అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. ఇవాళ ఉదయం టీవీ టవర్ సమీపంలో నిందితుడు అజయ్ ఉన్నట్లు శ్రీకాంత్‌కు సమాచారం వచ్చిందని.. తన సిబ్బందితో ఆటో డ్రైవర్ బాబాతో నిందితుడి కోసం టీవీ వద్దకు సీఐ వెళ్లారన్నారు. టీవీ టవర్ వద్ద ఆటో డ్రైవర్ బాబాపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి అజయ్ పరారైనట్లు తెలిపారు.
తోటపల్లిలోని చెరుకు తోటలో ఉన్నాడని సమాచారం రావడంతో రెండు టీంలు నిందితుడు అజయ్ కోసం వెళ్లాయని.. అయితే చెరుకు తోటలో సీఐ శ్రీకాంత్ యాదవ్‌పై నిందితుడు అజయ్ మరోసారి కత్తితో దాడి చేశాడన్నారు. నిందితుడు అజయ్ దాడిలో సీఐతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారన్నారు. దీనికి సంబంధించి నిందితుడిపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. అజయ్ ఆస్తులను జప్తు చేసేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. నిందితుడు దొంగతనాలు చేస్తూ.. జల్సా లకు అలవాటుపడ్డాడని తెలిపారు. ఒకే కత్తితో ముగ్గురిపై దాడి చేశాడని.. మూడు కేసులను నమోదు చేశామని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
మేం అలా చేస్తే మీరు రోడ్డు మీద తిరుగుతారా?.. వైసీపీకి అనిత స్ట్రాంగ్ కౌంటర్
వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు
Read Latest AP News And Telugu News