Ananthapur: తల్లి నగలు తాకట్టుపెట్టి మరీ.. యువతి సాహసం..
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:32 AM
ఏదైనా సాధించాలన్న తపన ఆ యువతిని కిలిమంజారో పర్వత శిఖరాలపైకి తీసుకెళ్లింది. పర్వతంలో రాళ్లు, గుండ్ల కంటే.. జీ వితంలోనే ఎక్కువగా కష్టాలను అధిగమించింది. నిరుపేద కుటుంబంలో పుట్టింది. కూలికెళ్తేనే కుటుంబం గ డుస్తుంది.
- 19ఏళ్లకే కిలిమంజారో పర్వతారోహణ
- దిగుమర్రి యువతి కుసుమ ప్రతిభ
నార్పల(అనంతపురం): ఏదైనా సాధించాలన్న తపన ఆ యువతిని కిలిమంజారో పర్వత శిఖరాలపైకి తీసుకెళ్లింది. పర్వతంలో రాళ్లు, గుండ్ల కంటే.. జీవితంలోనే ఎక్కువగా కష్టాలను అధిగమించింది. నిరుపేద కుటుంబంలో పుట్టింది. కూలికెళ్తేనే కుటుంబం గ డుస్తుంది. అయినా.. పేదరికం.. లక్ష్య సాధనకు అడ్డుకాలేదు. అన్న ప్రోత్సహించాడు. అమ్మ బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఆశయం దిశగా నడిపించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకుంది మండలంలోని దిగుమర్రి గ్రామానికి చెం దిన కుసుమ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని చెబుతోంది.
నిరుపేద కుటుంబం..
నార్పల(Narpala) మండలంలోని దిగుమర్రి గ్రామానికి చెందిన పెద్దన్న, నారాయణమ్మ దంపతులు కూలి పనులకు వెళ్తుంటారు. వారికి కుమారుడు కుళ్లాయప్ప, కుమార్తె కుసుమ సంతానం. కుళ్లాయప్ప హైదరాబాద్(Hyderabad)లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె అన్న వద్దే హైదరాబాద్‌లో ఉంటూ గీతం కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతోపాటు ఏదో ఒకటి సాధించాలని తపన పెంచుకుంది. కుసుమ లక్ష్యాన్ని తెలుసుకున్న అన్న కుళ్లాయప్ప హైదరాబాద్‌లో బసినేపల్లి శేఖర్‌బాబు అకాడమీలో పర్వతారోహణపై రెండేళ్ల పాటు శిక్షణ ఇప్పించాడు.
అనంతరం ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని కుసుమ నిశ్చయించుకుంది. అందుకు దాదాపు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. అంత డబ్బు లేకపోవడంతో అమ్మ బంగారాన్ని ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టి కుసుమకు రూ.6 లక్షలు సమకూర్చారు. ఆ డబ్బుతో కిలిమంజారో పర్వతారోహణకు కుసుమ బయల్దేరింది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని ఈ శిఖరం సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

దీనిని అధిరోహించడం కష్ట సాధ్యమైనదే. అయినా.. కుసుమ ముందడుగే వేసింది. ఈనెల 12వ తేదీన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించింది. అక్కడ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కూడిన ఫ్లెక్సీని ఎగురవేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. కాస్త అస్వస్థతగా ఉండడంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కుటుంబికులు తెలిపారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎవరెస్టు అధిరోహిస్తా: కుసుమ
అన్న ప్రోత్సాహం, అమ్మ త్యాగం ఎనలేనివి. వారి కారణంగానే కిలిమంజారోను అధిరోహించాం. ఎవరెస్టు శిఖరం ఎక్కడమే నా లక్ష్యం. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే అధిరోహిస్తా.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News