Gold Imports: పసిడి దిగుమతులు మూడింతలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:25 AM
అక్టోబరు నెలలో భారత పసిడి దిగుమతుల విలువ మూడింతలు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 1,472 కోట్ల డాలర్లకు (రూ.1,30,404 కోట్లు) చేరుకున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం గిరాకీ భారీగా...
అక్టోబరులో రికార్డు స్థాయికి.. రూ.1.30 లక్షల కోట్లకు చేరిక
పండగలు, పెళ్లిళ్ల సీజన్ గిరాకీయే ప్రధాన కారణం
న్యూఢిల్లీ: అక్టోబరు నెలలో భారత పసిడి దిగుమతుల విలువ మూడింతలు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 1,472 కోట్ల డాలర్లకు (రూ.1,30,404 కోట్లు) చేరుకున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం గిరాకీ భారీగా పుంజుకోవడం ఇందుకు కారణమని గత నెల విదేశీ వాణిజ్య గణాంకాల విడుదల అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ అన్నారు. 2024 అక్టోబరులో బంగారం దిగుమతులు 492 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతానికి మించిపోయింది. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు.
ఏడు నెలల్లో రూ.3.65 లక్షల కోట్ల దిగుమతులు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26).. గడిచిన 7 నెలల్లో (ఏప్రిల్-అక్టోబరు) మొత్తం పసిడి దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 21.44 శాతం పెరుగుదలతో 4,123 కోట్ల డాలర్ల్ల (రూ.3,65,256 కోట్లు)కు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి దిగుమతులు 3,400 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న తరుణంలోనూ బంగారం గిరాకీ పెరుగుతూ పోతుండటం విశేషం. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం రూ.1.30 లక్షల చేరువలో ఉంది.
వెండి దిగుమతుల్లో 529 శాతం పెరుగుదల: గత నెలలో వెండి దిగుమతులు ఏకంగా 528.71 శాతం పెరిగి 271 కోట్ల డాలర్లు (రూ.24,007 కోట్లు)గా నమోదయ్యాయి. వెండిని ఆభరణాలు, వంట, పూజ సామాగ్రి తయారీతో పాటు ఎలకా్ట్రనిక్స్, ఆటో, ఫార్మా వంటి పరిశ్రమల్లోనూ వినియోగిస్తారు.
40% స్విట్జర్లాండ్ నుంచే
గతనెల పసిడి దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే సరఫరా జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వాటా 16 శాతంగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు 403.67 శాతం పెరిగి 508 కోట్ల డాలర్లకు చేరాయి. గడిచిన ఏడు నెలల్లో దిగుమతులు 10 శాతానికి పైగా పెరిగి 1,540 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
అమెరికాకు తగ్గిన భారత ఎగుమతులు
భారత విదేశీ వాణిజ్యంపై అమెరికా అఽధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు గణనీయ ప్రభావం చూపుతున్నాయి. అమెరికాకు మన వస్తు ఎగుమతులు వరుసగా రెండో నెలా తగ్గాయి. గతనెలలో 8.58 శాతం క్షీణించి 630 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.55,811 కోట్లు) పడిపోయాయి. అమెరికా నుంచి దిగుమతులు మాత్రం వార్షిక ప్రాతిపదికన 13.89 శాతం పెరిగి 446 కోట్ల డాలర్లకు (రూ.39,511 కోట్లు) చేరాయి.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి