Ford CEO Labor Shortage: అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:24 PM
అమెరికాలో నిపుణులైన టెక్నీషియన్ల కొరత ఉందని ఫోర్డ్ సంస్థ సీఈఓ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, తాము 5 వేల ఉద్యోగాల భర్తీ చేయలేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉందని ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ సీఈఓ (Ford CEO) జిమ్ ఫార్లీ తాజాగా తెలిపారు. తమ సంస్థలో 5 వేల మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిపుణులు దొరక్క ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అమెరికా సగటు జీతం కంటే రెట్టింపు ఇంచేందుకు సిద్ధంగా ఉన్నా ఉద్యోగులు దొరకట్లేదని అన్నారు. ఆఫీసర్ అవర్స్.. బిజినెస్ ఎడిషన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికాకు ఓ మేలుకొలుపు అని కూడా వ్యాఖ్యానించారు (US Skilled Labor Shortage).
‘కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన మిలియన్ ఉద్యోగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎమెర్జెన్సీ సర్వీసులు, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ వర్కర్లు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్‌లు, ఇతర వృత్తినిపుణుల కొరత ఉంది. ఇది చాలా సీరియస్ విషయం’ అని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఫోర్డ్ డీజిల్ ఇంజెన్‌పై పనిచేసే టెక్నీషయన్‌కు శిక్షణ ఇచ్చేందుకు కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందని అన్నారు. కానీ నేటి విద్యావ్యవస్థలో సరైన శిక్షణ లేకపోవడంతో నిపుణులకు కొరత ఏర్పడుతోందని అన్నారు. పరిశ్రమలు కోరుకున్న ప్రమాణాలను ప్రస్తుత విద్యావ్యవస్థ అందించలేక పోతోందని తెలిపారు.
అమెరికాలో నిపుణులైన వర్కర్లు లేరని ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. హెచ్-1బీ వీసా వ్యవస్థపై ఆంక్షలను సమర్థించుకుంటూనే ట్రంప్.. నిపుణులను దేశంలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. టెక్ రంగ సంస్థలు అధికంగా ఆధారపడే హెచ్-1బీ వీసా వ్యవస్థ నిబంధనలు ట్రంప్ సర్కారు ఇటీవల కాలంలో కఠినంగా మార్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి