US Job Cuts: అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:34 PM
అక్టోబర్ నెలలో అమెరికా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాయని ఓ ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసెస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. 1.5 లక్షల పైచిలుకు మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా 153,074 మందికి ఉద్వాసన పలికాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లేఆఫ్స్ 175 శాతం ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చినా కూడా అక్టోబర్‌లో ఉద్యోగాల్లో కోతలు 183 శాతం అధికంగా ఉన్నాయి. గ్లోబల్ ఔట్‌ప్లేస్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ కోచింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి (US Layoffs).
‘అక్టోబర్‌లో ఈసారి ఉద్యోగాల కోతలు ఆ నెల సాధారణ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో చేపట్టిన నియామకాల ఫలితంగా కొన్ని సంస్థలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాయి. ఏఐ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ లేఆఫ్స్ చోటుచేసుకోవడం గమనార్హం. కన్జ్యూమర్, కార్పొరేట్ నిధుల ఖర్చు కూడా తగ్గింది. కొత్త నియామకాలు కూడా నిలిచిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త జాబ్స్ దొరకడం కష్టంగా మారింది’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ నివేదిక ప్రకారం, జనవరి నుంచి అక్టోబర్ వరకూ అమెరికా సంస్థలు మొత్తం 1,099,500 మందిని తొలగించాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లేఆఫ్స్ 64 శాతం శాతం మేర పెరిగాయి. 2020 తరువాత ఈ స్థాయిలో లేఆఫ్స్ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. మరిన్ని లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్టు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించాయి. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతున్న తరుణంలోనే లేఆఫ్స్ పెరగడం ఆందోళన కలిగించే అంశమని సంస్థ తన నివేదికలో పేర్కొంది.
మనుషుల అంచనాకంటే వేగంగా ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతోందని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల పేర్కొంది. ఏఐ అంటే చాట్‌బాట్స్ అనే భ్రమలోనే జనాలు ఇంకా ఉన్నారని వ్యాఖ్యానించింది. ఒక పరిశోధకుడి సామర్థ్యంలో దాదాపు 80 శాతానికి ఏఐ చేరుకుందని తెలిపింది. ఈ నేపథ్యంలో మానవ సమాజ భవిష్యత్తుపై చర్చ పెద్దైంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి