Share News

Mercedes Benz India: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:29 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లు, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాల (బీఈవీ)కు రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది...

Mercedes Benz India: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

మెర్సిడెస్‌ ఈవీ విక్రయాల్లో ఏపీ, తెలంగాణ టాప్‌

  • మొత్తం విక్రయాల్లో 10% వాటా

  • త్వరలో విశాఖలో కొత్త షోరూమ్‌

  • వచ్చే ఏడాది సీఎల్‌ఏ ఈవీ కారు విడుదల

  • మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లు, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాల (బీఈవీ)కు రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది. మెర్సిడెస్‌ కార్ల విక్రయాల్లో ఈ రెండు రాష్ట్రాలు చాలా కీలకంగా ఉన్నాయని సంస్థ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ అన్నారు. టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లు, బీఈవీ విభాగంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ అగ్రగామిగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో ఏటా 50,000 పైగా లగ్జరీ కార్ల విక్రయాలు నమోదవుతున్నాయని, ఇందులో మెర్సిడెస్‌ బెంజ్‌ వాటా 45 శాతంగా ఉందన్నారు. కాగా కంపెనీ లగ్జరీ కార్ల విక్రయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉండగా బీఈవీ అమ్మకాల్లో 10 శాతంగా ఉందని ఆయన చెప్పారు. భారత్‌లో మొత్తం ఈవీ విక్రయాల్లో కంపెనీ వాటా సగటున 8 శాతం ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి ఉండటం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ కార్లకు సంబంధించి సానుకూల పన్ను విధానాలు, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలతో పాటు అధికాదాయ వర్గాల (హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌, హెచ్‌ఎన్‌ఐ) వారు ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు భారీగా ఉంటున్నాయని అయ్యర్‌ వెల్లడించారు.


హైదరాబాద్‌లో తొలి మేబాక్‌ లాంజ్‌: మెర్సిడెస్‌ బెంజ్‌ టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మేబాక్‌ లాంజ్‌ను ఏర్పాటు చేసినట్లు సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. ప్రస్తుతం మెర్సిడెస్‌ బెంజ్‌కు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం కీలక మార్కెట్లుగా ఉన్నాయని, ఇక్కడ మొత్తం 10 సేల్స్‌, సర్వీస్‌ పాయింట్లను నిర్వహిస్తున్నట్లు అయ్యర్‌ తెలిపారు. విస్తరణలో భాగంగా త్వరలో విశాఖపట్నంలో మూడో ఫ్రాంఛైజీ భాగస్వామిని నియమించుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఏటా 20,000 కార్ల తయారీ: మహారాష్ట్ర, పుణె సమీపంలోని చకన్‌లో రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన మెర్సిడెస్‌ ప్లాంట్‌లో ఏటా 20,000 కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు అయ్యర్‌ తెలిపారు. గత ఏడాది కంపెనీ విక్రయాలు 19,500 యూనిట్ల వరకు ఉన్నాయని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. జీఎ్‌సటీ 2.0తో అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరిగాయని తెలిపారు. అయితే యూరో మారకంలో రూపాయి బలహీనపడటంతో వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచాలని నిర్ణయించినట్లు అయ్యర్‌ వెల్లడించారు.

000-Business.jpg

జనవరి త్రైమాసికంలో సీఎల్‌ఏ ఈవీ

మెర్సిడెస్‌ బెంజ్‌ భారత పోర్టుఫోలియోలో మొత్తం 25 కార్లు ఉండగా అందులో 11 కార్లను స్థానికంగా పుణెలో ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు అయ్యర్‌ వివరించారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్‌ కార్లను ఇక్కడే తయారు చేస్తున్నట్లు చెప్పారు. కాగా వచ్చే రెండేళ్లలో మెర్సిడెస్‌ ప్రపంచవ్యాప్తంగా 40 కొత్త మోడళ్లను విడుదల చేయనుండగా అందులో 11 మోడళ్లను భారత్‌లోనే తయారు చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు వచ్చే జనవరి త్రైమాసికంలో ఎంట్రీ లెవల్‌ కారు సీఎల్‌ఏ విభాగంలో ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. సుమారు రూ.50 నుంచి 60 లక్షల ధర ఉండే ఈ కారు ఒకసారి చార్జింగ్‌తో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుందన్నారు.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 06:29 AM