Share News

Anantapur: కోడిబాయె లచ్చమ్మదీ.. నాటు కోడిబాయే లచ్చమ్మదీ

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:57 PM

నాటు కోడి కంటపడితే మాయం చేసేస్తున్నారు ఇద్దరు యువకులు. తెలిసినవాళ్లు ఫోన్‌ చేసి.. ‘రేయ్‌ మామా.. కోడి..’ అని అడిగిందే తడవు సరఫరా చేస్తున్నారు. వీరి దెబ్బకు ఇళ్ల వద్ద నాటు కోళ్లను పెంచుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు.

Anantapur: కోడిబాయె లచ్చమ్మదీ.. నాటు కోడిబాయే లచ్చమ్మదీ

- నాటు కోళ్లు మాయం చేస్తున్న ఆ ఇద్దరు

- క్వార్టర్‌ మందు.. రూ.200 ఇస్తే చాలు.. సరఫరా

- శింగనమలలో తరచూ బాధితులతో గొడవలు

- పోలీసులకు ఫిర్యాదు వెళ్లినా.. మందలింపుతో సరి

శింగనమల(అనంతపురం): నాటు కోడి కంటపడితే మాయం చేసేస్తున్నారు ఇద్దరు యువకులు. తెలిసినవాళ్లు ఫోన్‌ చేసి.. ‘రేయ్‌ మామా.. కోడి..’ అని అడిగిందే తడవు సరఫరా చేస్తున్నారు. వీరి దెబ్బకు ఇళ్ల వద్ద నాటు కోళ్లను పెంచుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు. దొంగ కోళ్ల వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లినా తేలిగ్గా తీసుకుంటున్నారు. ‘కోడే కదా..’ అని మందలింపుతో సరిపెడుతున్నారు. దీంతో ఆ ఇద్దరూ పేట్రేగిపోతున్నారని బాధితులు వాపోతున్నారు.


బస్టాండ్‌మే సవాల్‌..

సెప్టెంబరు 28వ తేదీ ఆదివారం..! పట్టణానికి చెందిన రామాంజనేయులు, చంద్రకళ దంపతుల నాటు కోళ్లు మాయమయ్యాయి. వారు వీధి కెక్కి తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఆ దెబ్బకు మాయమైన కోళ్లు ఓ ఇంటి నుంచి కూత పెట్టుకుంటూ బయటకు పరిగెత్తుకు వచ్చాయి. ఆ ఇల్లు.. ఆ ఇద్దరు యువకుల బంధువులదట. దీంతో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఆ ఇద్దరు యువకులను రామాంజనేయులు నిలదీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాని హెచ్చరించాడు. దీంతో గొడవ ముదిరి.. ‘అవును.. మీ కోళ్లను మీమే తీసుకుపోయాం. ఇప్పుడు వదిలేశాం. మళ్లీ పట్టుకుపోతాం.. ఏం చేసుకుంటారు..?’ అని ఆ యువకులు ఎదురు తిరిగారు. గొడవ ముదిరి పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది. కోళ్లను దొంగతనం చేసింది కాక తమపై దాడి చేశారని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


aaaa.jpg

మందు బాటిల్‌ ఇస్తే చాలు..

దొంగ కోళ్ల వ్యవహారం శింగనమలతోపాటు గుత్తి మండలం, కర్నూలు జిల్లాకూ విస్తరించినట్లు సమాచారం. మార్కెట్‌లో ‘పల్లె నాటు’కు డిమాండ్‌ కూడా భారీగా ఉంది. ఈ లెక్కన దొంగ కోళ్లను పట్టుకుని ఆ ఇద్దరు యువకులు బాగా సంపాదిస్తున్నారేమో అనుకుంటే ‘కోడి కూర’లో కాలేసినట్లే..! ఓ రూ.200 నగదు.. క్వార్టర్‌ బాటిల్‌ మందు ఇస్తే చాలు.. నాటు కోడిని ఇచ్చేస్తారట. నాటు కోడి తినాలని అనిపిస్తే చాలు ‘రేయ్‌ తమ్ముడూ.. నోరు చెడిపోయింది..’, ‘రేయ్‌ మామా.. ఫ్రెండొచ్చాడు..’ అని ఫోన్‌ కొడతారట. బంధువులు, ఫ్రెండ్స్‌ వచ్చినా, బర్త్‌ డే పార్టీ అయినా.. చివరకు మూడ్‌ బాగలేకపోయినా ‘కస్టమర్లు’ వీరిని సంప్రదిస్తున్నారట. నాటు కోడి రుచి చూడాలని అనుకునేవారికి ఈ ఇద్దరూ బెస్ట్‌ సర్వీస్‌ చేస్తున్నారని ప్రచారం ఉంది. కనీసం రూ.1000 పెడితేగానీ దొరకని నాటుకోడిని వీరు రూ.200కే ఇచ్చేస్తున్నారని సమాచారం. కస్టమర్లు వీరిని లైన్‌లో పెట్టుకునేందుకు మందు బాటిల్‌ను కానుకగా ఇస్తున్నారని అంటున్నారు. అదీ.. ఓ సినిమా హీరో వాడే బ్రాండ్‌ అట..! ఈ ఇద్దరికి ఇద్దరు పోలీసులతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.


రేయ్‌.. మా పేరు చెప్పకండ్రా..

పది రోజుల క్రితం బస్టాండు వద్ద జరిగిన దొంగ కోళ్ల గొడవ స్టేషన్‌ వరకూ వెళ్లడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు పిలిపించారు. దీంతో తమ పేర్లు ఎక్కడ బయట పెడతారోనని దొంగ కోళ్లను వండుకుతిన్నవారు బెంబేలెత్తిపోయారు. ఏం జరుగుతుందో చూద్దామని కొందరు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లి పరిణామాలను గమనించారు. మరికొందరు తెలిసినవారిచేత పోలీసులకు ఫోన్‌లు చేయించుకున్నారని సమాచారం. కేసు కట్టకపోయినా, ఆ రోజు నుంచి ఆ ఇద్దరు యువకులు స్టేషన్‌కు వచ్చిపోతున్నారు. దీంతో ‘రేయ్‌.. మా పేరు చెప్పకండ్రా..’ అని ‘రుచి చూసినవారు’ బతిమాలుతున్నారట.


కేసు నమోదు చేస్తాం..

నాటు కోళ్ల విషయంలో దాడి జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. పది రోజులుగా తిరుమల విధుల్లో ఉన్నాం. ఇన్‌చార్జి ఎస్‌ఐ ఉన్నందున కేసు నమోదు చేయలేదు. ఇద్దరు యువకులపై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నాయని తెలిసింది. విచారించి కేసు నమోదు చేస్తాం.

- విజయ్‌కూమార్‌, ఎస్‌ఐ, శింగనమల


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 07 , 2025 | 04:57 PM