Ananthapur News: నకిలీ సిమెంట్ బాగోతం గుట్టురట్టు..
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:21 AM
నకిలీ సిమెంట్ బాగోతం గుట్టురట్టయింది. గత 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- 15 ఏళ్ల దందాలో రూ.కోట్ల ఆర్జన
- విజిలెన్స్ దాడుల్లో వెల్లడైన నిజాలు
పెనుకొండ(అనంతపురం): ఒకటిన్నర దశాబ్ద కాలం నుంచి సాగుతున్న అక్రమ వ్యాపారం బాగోతం బట్టబయలైంది. విజయవాడకు చెందిన మహేష్ గోరంట్ల మండలం గుత్తివారిపల్లి సమీపంలో 15ఏళ్ల కిందట కస్తూరీ సిమెంటు ఫ్యాక్టరీ పేరుతో రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి లేపాక్షి సిమెంటు పేరుతో సిమెంటు తయారు చేయడానికి అనుమతి పొందాడు. అయితే అతడు నకిలీ సిమెంటు తయారు చేసి, ప్రముఖ కంపెనీల పేరుతో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.

విజిలెన్స్ తనిఖీలో ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. నకిలీ సిమెంట్ తరలించడానికి తొలుత వివిధ రకాల సిమెంటు కంపెనీల పేర్లున్న ఖాళీ సంచులను తమిళనాడు(Tamil Nadu) నుంచి తెస్తారు. బయట లారీల్లో వచ్చిన బూడిద(ఫ్లైయాష్), 20శాతం సిమెంటు కలిపి ఆ సంచుల్లో నింపుతారు. దాన్ని ప్రముఖ సిమెంటు కంపెనీల పేరుతో కర్ణాటకకు తరలించి విక్రయిస్తాడు. ఒక సిమెంటు బస్తా తయారీకి రూ.50 ఖర్చవుతుండగా లాభం రూ.300 వస్తోంది. రసీదులు కూడా నకిలీవి తయారు చేయించి, కర్నూలు నుంచి ఇన్వాయిస్ ఇస్తూ నకిలీ సిమెంటు బస్తాలు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

దీంతో గోరంట్ల పోలీస్స్టేషన్(Gorantla Police Station)లో విజయవాడకు చెందిన నిర్వాహకుడు మహే్‌షపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. 15ఏళ్లలో నకిలీ సిమెంటు తయారు చేసి దాదాపు రూ.43కోట్లు దోపిడీ చేశారని విజిలెన్స్ అధికారుల దాడుల్లో తేలింది. స్థానికులకు అనుమానం రాకుండా ఉండేందుకు సిమెంటు కంపెనీలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల వారిని పెట్టుకుని వ్యవహారం కొనసాగించాడు. నకిలీ వ్యవహారం బయటపడటంతో సిమెంటు ఫ్యాక్టరీ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. గోరంట్ల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News