Share News

Amaravati Restart: జయ జయ అమరావతి

ABN , Publish Date - May 03 , 2025 | 04:26 AM

ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభమయ్యాయి. వెలగపూడిలో లక్షలాది మంది తరలివచ్చి సందడి చేశారు

Amaravati Restart: జయ జయ అమరావతి

  • వెలగపూడికి పోటెత్తిన జన తరంగం

  • ప్రధాని మోదీ అభయంతో ఆనందం

  • రూ.58 వేల కోట్ల పనులకు శ్రీకారం

అమరావతి, గుంటూరు, మే 2(ఆంధ్రజ్యోతి): ఐదు కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి శాశ్వత పునాది పడుతున్న వేళ జన తరంగం ఉప్పెనై ఎగసింది. పదేళ్ల కిందట అమరావతికి అంకురార్పణ జరిగిన చోటే ఇక ఎవరూ కదిలించలేని రీతిలో నిర్మాణ పనులు ఉత్సాహ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. ‘‘అమరావతి కేవలం రాష్ర్టానికి పరిమితం కాదు. వికసిత్‌ భారత్‌కు గ్రోత్‌ ఇంజన్‌ అవుతుంది’’ అని ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఆంధ్రుల ఆశలు మళ్లీ చిగురించినట్లైంది.

టెన్షన్‌ పెట్టిన వరుణుడు

అమరావతి సభవేదిక మీదకు 3.54 గంటల సమయంలో ప్రధాని, సీఎం, ఇతరులు వచ్చారు. అంతకుముందు సభా ప్రాంగణానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ చేరుకున్న సమయంలో ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ స్వాగతం పలికారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడితో కొంత ఇబ్బంది పడినా సాయంత్రానికి వాతావరణం మేఘావృతమై చల్లబడింది. అయితే, వర్షం పడకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సభా ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటుచేశారు. ఒకటి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించగా, మరొకటి ప్రధాన వేదిక. ప్రధాన వేదికపై మొత్తం 12 మంది ఆశీనులయ్యారు. ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ వర్మ, రాష్ట్ర కేబినెట్‌ మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్‌ ఉన్నా రు. ప్రధానికి ఇరువైపులా గవర్నర్‌, సీఎం చంద్రబాబు ఉన్నారు.


స్పష్టంగా రామ్మోహన్‌ అనువాదం

ప్రధాని మోదీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి స్పష్టంగా అనువాదం చేశారు. ఎక్కడా చిన్న తడబాటు కూడా లేకుండా, క్లిష్టమైన పదాలను కూడా అలవోకగా పలికారు. ‘‘ఇది మనం చేయాలి. మనమే చేయాలి’’ అని ప్రధాని తెలుగులోనే సరళంగా పలికిన పదాలను ‘‘మనమే చేయాలి’’ అనేది నొక్కి చెప్పి, అందులోని భావాన్ని అర్థమయ్యేలా అనువదించారు. కాగా, సాధారణంగా బహిరంగ సభల్లో ఉల్లాసంగా కనిపించే ప్రధాని మోదీ అమరావతి వేదికపై గంభీరంగా కనిపించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన, అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన మరీ అంత ఉత్సాహంగా కనిపించలేదు. అయితే ప్రసంగించే సమయంలో మాత్రం ఉల్లాసంగానే కనిపించారు. అమరావతి సభలో జాతీయవాద స్ఫూర్తి కనిపించింది. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా వందేమాతరం అంటూ చాలా గట్టిగా నినదించారు.

ఆకట్టుకున్న అమరావతి ఏవీ

అమరావతిపై ప్రదర్శించిన ఏవీ(వీడియో) అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్రులకు రాజధాని ఎన్నిసార్లు దూరమైందనే దగ్గరి నుంచీ ఇప్పుడెలా తిరిగి సాకార మైందనే దాకా పలు ఘట్టాలతో ప్రభుత్వం ఏవీ రూపొందించింది. అమరావతికి రైతులు భూములు ఇవ్వడం, పదేళ్ల కిందట శంకుస్థాపన, పుణ్య నదీజలాలు, పవిత్ర మట్టి సమీకరణ తదితర ఘట్టాలను మొదటగా చూపించారు. ఆ తర్వాత 2019-24 మధ్య రాజధాని ఎలా నిర్వీర్యం అయిందో చూపించారు. రైతుల ఉద్యమం, వారిపై లాఠీచార్జ్‌... మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడంతో మంచిరోజులు వచ్చినట్లుగా చూపించిన ఏవీ బాగుంది.


ఉత్సాహంగా.. ఉల్లాసంగా...

అమరావతి పనుల పునఃప్రారంభ వేదిక వెలగపూడి జనసంద్రాన్ని తలపించింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిసినా సమీప జిల్లాల ప్రజలు మధ్యాహ్నం లోపే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ విజయవాడ, కృష్ణా జిల్లాల నుంచి భారీగా జనం తరలివస్తారని అంచనా వేశారు. అయితే అంతకు మించిన స్థాయిలో జనం వచ్చారు. సభా వేదికకు చుట్టుపక్కల కిలోమీటరు మేర ఎటు చూసినా జనమే కనిపించారు. ఎండను లెక్కచేయక సభా ప్రాంగణం వద్దే ఉన్నారు. ఇక.. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విదేశాల నుంచి ఎన్నారైలు కూడా సభకు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎన్నారై టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ దొడ్డపనేని సాగర్‌, గల్ఫ్‌ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఏపీ ఎన్నార్టీ ఎక్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 04:26 AM