TTD darshan system: ఏఐతో దర్శనంపై మాటల తూటాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:46 AM
తిరుమల శ్రీవారి దర్శనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా మూడు గంటల్లో చేయించడమనేది
దీనితో 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం
ఆ ప్రయత్నం కూడా ఏ మాత్రం క్షేమకరం కాదు
టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు
ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడటమా?
ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం: చైర్మన్
తిరుమల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా మూడు గంటల్లో చేయించడమనేది అసంభవమని టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘టీటీడీ గంట, మూడు గంటల్లో దర్శనం చేయిస్తుందని కొంతమంది భక్తులు సంభాషిస్తుండగా విన్నాను. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి ప్రయత్నించడం కూడా ఏమాత్రం క్షేమకరం కాదు. ఏఐని తీసుకొచ్చినా ఆలయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికోసం ధనాన్ని వ్యయం చేయకూడదు. అలాంటి ఆలోచనలకు వెంటనే స్వస్తి పలకాలి. ఇది జరిగే పని కాదు. ఇంతకుముందు అనేకమంది ఈవోలు, చైర్మన్లు ఎన్నో ఆలోచనలు చేశారు. ఆలయాన్ని ముట్టుకోకూడదు కాబట్టి వాటిని విరమించుకున్నారు’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాగా, ఎల్వీ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల క్యూ కాంప్లెక్స్‌లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గూగుల్, టీసీఎస్, ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ సాంకేతికత ఉపయోగించి నిర్దేశిత సమయంలోపు వారికి దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. ‘శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్దేశించిన సమయానికి దర్శనం కల్పించడం, దర్శన సమయాన్ని వారికి ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ విధానం అమలుకు నిర్ణయించాం. ఇలాంటి సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఒక సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవమున్న ఆయన తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయి. దాతల సాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి సేవలను సులభతరం చేస్తున్నారు. అదే పద్ధతిలో టీటీడీలోనూ దర్శన సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేసేందుకు, మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు మాత్రమే ఉపయోగించేలా నిర్ణయించాం’ అని చైర్మన్ పేర్కొన్నారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి