Agrigold Land Scam: అగ్రిగోల్డ్ లో అడ్డంగా దొరికిన జోగి
ABN , Publish Date - May 24 , 2025 | 03:29 AM
అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చిక్కుల్లో పడ్డారు. తన కుమారుడు, సోదరుడి పేర్లతో లావాదేవీలు జరిపి, వ్యవహారాన్ని తెరవెనుక నుంచే నడిపించారు.

సీఐడీ, ఈడీ అటాచ్‌లోని భూముల స్వాహా గుట్టు రట్టు
రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ విచారణలో ఆధారాలు లభ్యం
భూములు కొన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టి
వాటినే ప్లాట్లుగా వేసి తిరిగి విక్రయం
కుమారుడు, సోదరుడి పేరిట లావాదేవీలు
తెరవెనుక కథ నడిపించిన మాజీ మంత్రి
అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను పరిశీలిస్తున్న అధికారులు
విజయవాడ, మే 23(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అడ్డంగా బుక్కయ్యారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఏకంగా సీఐడీ, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి, వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో జోగి రమేశ్ తన కొడుకు, సోదరుడిని రంగంలోకి దింపారు. భూ లావాదేవీలన్నీ వారి పేరిటే జరిగాయి. జోగి రమేశ్ తెరవెనుక ఉండి మొత్తం కథ నడిపించారు. గురువారం సాయం త్రం రెవెన్యూ, సీఐడీ, ఏసీబీల సంయుక్త బృందం.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలను నిగ్గుతేల్చింది. అగ్రిగోల్డ్ భూములను విక్రయించినట్టు చట్టబద్ధమైన ఆధారాలు లభించాయి. దీంతో జోగి రమేశ్ మెడకు మరింతగా ఉచ్చు బిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. సీఐడీ, ఈడీ అటాచ్‌లో ఉన్న భూములను కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు సాగించే అధికారం ఎవరికీ లేదు. జోగి రమేశ్ సాగించిన భూ దందాలో ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. ప్రస్తుతం ఆయన కుమారుడు జోగి రాజీవ్ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసులో వాస్తవాలు నిగ్గు తేలటంతో రాజీవ్‌తో పాటు అదృశ్యంగా ఉండి ఈ మొత్తం కథను నడిపించిన అంతిమ లబ్ధిదారు జోగి రమేశ్‌ను కూడా కేసులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ కేసు నేపథ్యం..
పేద, మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం.. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది. భూములే కాకుండా భవనాలు, అనేక వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న తర్వాత ప్రజలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చు టోపీ పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములను సీఐడీ స్వాధీనం చేసుకుంది. వాటిలో విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. 2024 మార్చిలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ భూములను ఇతరులకు విక్రయించారని విజయవాడ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్పటి విజయవాడ రూరల్ తహశీల్దార్ జాహ్నవికి సమగ్ర సమాచారం కోసం లేఖ రాశారు. పోలీసులు, ఆ తర్వాత ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన లేఖల మేరకు మార్చి 20వ తేదీన తహశీల్దార్ జాహ్నవి ప్రతి లేఖ రాశారు. ఆ భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యానివేనని అప్పట్లో ప్రాథమికంగా తేల్చారు. దీని ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగి కేసు పెట్టింది.
తప్పు మీద తప్పులు
సీఐడీ అటాచ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూములపై జోగి రమేశ్ కన్నేశారు. వాటిని కొట్టేయడానికి పక్కా ప్యూహాన్ని అమలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల పక్కనే ఉన్న సర్వే నంబర్ 88లో పోలవరపు మురళీమోహన్ దగ్గర జోగి రమేశ్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేరుతో 1086 చదరపు గజాలు, కుమారుడు జోగి రాజీవ్ పేరుతో 1074 చదరపు గజాలు వెరసి మొత్తం 2,160 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించారు. వీటి కి రిజిస్ర్టేషన్ కూడా జరిగింది. అంబాపురంలోని సర్వే నంబర్ 88 ఈసీని పరిశీలిస్తే.. బొమ్ము వెంకట చలమారెడ్డి 4 ఎకరాల భూమిని పోలవరపు మురళీమోహన్‌కు ఎకరం, అద్దేపల్లి కిరణ్‌కుమార్‌కు ఎకరం, రామిశెట్టి రాంబాబుకు 2 ఎకరాలు విక్రయించారు. ఇలా కొనుగోలు చేసిన భూమిని పోలవరపు మురళీమోహన్ నాటి వీజీటీఎం-ఉడా దగ్గర అప్రూవల్ తీసుకుని ప్లాట్లు వేశారు. ఆ ప్లాట్లను దస్తావేజు నంబర్లు 4443, 4444, 4445, 4446, 4447, 4448, 4449/2003, 5283, 5284, 5285, 5286/2004 ద్వారా 2301 చదరపు గజాల స్థలాన్ని విక్రయించారు. అలాంటపుడు.. పోలవరపు మురళీమోహన్ మళ్లీ ఈ భూములను జోగి కుటుంబీలకు ఎలా విక్రయిస్తారన్నది ప్రశ్న. జోగి రమేశ్‌కు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి పక్కా సమాచారం ఉండటంతో ఆ భూములను ఆధీనంలోకి తీసుకోవటానికి కొత్త ఎత్తుగడ వేశారు. సర్వే నంబర్ 88లో తాము భూములు కొనుగోలు చేసినట్టుగా (డాక్యుమెంట్ నంబర్లు 7592, 7589, 7590, 7591/2022) చెబుతున్న భూముల సర్వే నంబర్ తప్పుగా నమోదైందని, అవి సర్వే నంబర్ 87లో ఉన్నట్టుగా అప్పటి మండల సర్వేయర్ ద్వారా ఎఫ్ లైన్ కాపీని ప్రవేశపెట్టారు. దాని ఆధారంగా జోగి వెంకటేశ్వరరావు సవరణ దస్తావేజు నంబర్ 2676/2023 ద్వారా తమ భూములు ఆర్‌ఎస్ నంబర్ 87లో ఉన్నట్టుగా సవరణ రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. జోగి రాజీవ్ కూడా సర్వే నం. 88 తప్పుగా నమోదైందని సర్వేనం.87 పేరుతో సవరణ (డాక్యుమెంట్ నంబర్లు 2674/2023, 267 5/2023) చేయించుకున్నారు. ఆ తర్వాత ఈ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించుకున్నారు.
ప్లాట్లు వేసి విక్రయం
అక్రమ రిజిస్ర్టేషన్లతో పొందిన అగ్రిగోల్డ్ భూములను 7 ప్లాట్లుగా చేసి జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్‌లు వైసీపీ నేత, వారి కుటుంబ సభ్యులకు విక్రయించారు. 2023లో పడిగపాటి దుర్గా ప్రసాద్ (208.5చ.గజాలు), పడిగపాటి దుర్గా ప్రసాద్(208.5చ.గజాలు), పడిగపాటి దుర్గా భవాని(208.5చ.గజాలు), సోముల దుర్గా భవాని (208.5 చ.గజాలు), సోముల వెంకటేశ్వరరెడ్డి(208.5 చ.గజాలు), పడిగపాటి బాలమ్మ(208.5 చ.గజాలు), పడిగపాటి బాలమ్మ(208.5చ.గజాలు), పడిగపాటి సుబ్బారెడ్డి(208.5 చ.గజాలు)లకు విక్రయించారు.