Mithun Reddy : ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:24 AM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
విజయవాడ, సెప్టెంబర్ 8 : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.. నేడు మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేయనుంది. జులై 19, 2025న సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు హాజరై మిధున్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయంలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణలు, వేల కోట్ల అక్రమ లాభాలకు సంబంధించిన కేసులో మిథున్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు. సిట్ రిపోర్టుల ప్రకారం, మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో 'మాస్టర్ మైండ్'గా పనిచేశారని, పాలసీ మార్పులు, లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏప్రిల్ 3, 2025న ఏపీ హైకోర్టు, జులై 18, 2025న సుప్రీం కోర్టు తిరస్కరించాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ (ఇంటరిమ్ బెయిల్) మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, ఆయనకు 5 రోజుల అనుమతి (సెప్టెంబర్ 6 నుండి 11 వరకు) ఇచ్చింది. రూ.50,000 పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ ఇచ్చింది. మిథున్ రెడ్డి ఈ బెయిల్‌పై జైలు నుండి విడుదలయ్యారు. అయితే, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణలో సిట్ అధికారులు బలమైన ఆడియో, వీడియో, సాక్షుల వాంగ్మూలాలు సమర్పించవచ్చని తెలుస్తోంది.
మిథున్ రెడ్డి వైసీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్టయ్యారు. నలుగురికి బెయిల్ మంజూరైంది. నేటి విచారణలో కోర్టు బెయిల్ మంజూరు చేస్తే, మిథున్ రెడ్డికి మరింత ఊరట లభిస్తుంది. తిరస్కరిస్తే జైలు జీవితం కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి