పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, సీమకు తీరనినష్టం: బొత్స
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:16 AM
శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ఎత్తును 45.72 నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ నిధులు కేటాయించడం బాధాకరమన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే తలెత్తే ఇబ్బందులపై నీటిపారుదల శాఖ నిపుణులు, మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ బడ్జెట్‌లో మహాకవి గురజాడ పేరు ప్రస్తావించడం తప్పితే రాష్ట్రానికి ప్రయోజనమేమీ లేదని ఎద్దేవా చేశారు. బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్ పార్టీకి 12 మంది ఎంపీలు ఉంటేనే ఆ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయని, కానీ 16 మంది టీడీపీ ఎంపీల మద్దతు ఉన్న ఏపీని మాత్రం కేంద్రం విస్మరించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అడ్డుచెప్పడం వల్లే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని, ఈ విషయాన్ని ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతమని.. దీనిపై తాను స్పందించనని బొత్స చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News