Share News

YS Sharmila: వివేకా నిందితుల్ని కాపాడుతోంది జగనే.. షర్మిల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:35 PM

వైఎస్ వివేకా నిందితుల్ని స్వయానా సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసింది వాళ్లే అని తెలిసినా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, ఇందుకు కారణం వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు.

YS Sharmila: వివేకా నిందితుల్ని కాపాడుతోంది జగనే.. షర్మిల సంచలన ఆరోపణలు

వైఎస్ వివేకా (YS Viveka) నిందితుల్ని స్వయానా సీఎం జగన్ (YS Jagan) కాపాడుతున్నారని ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసింది వాళ్లే అని తెలిసినా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, ఇందుకు కారణం వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో అవినాష్ రెడ్డి (Avinash Reddy) హస్తం ఉందని సీబీఐ ఆధారాలు చూపించిందని, నిందితులతో కాల్ రికార్డ్స్ ఉన్నట్లు గుర్తించిందని, అయినప్పటికీ అతనిపై చర్యలు లేవని మండిపడ్డారు. పైగా.. అవినాష్‌కి మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారని, అందుకే తాను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని వివరణ ఇచ్చారు. నిందితులు చట్టసభల్లో అడుగుపెట్టొద్దనే పోటీ చేస్తున్నానని, ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయాలని సూచించారు.

చీరతో క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు


ఒకవైపు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. మరోవైపు అధికారం, డబ్బు ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తమవైపు ధర్మం, అటువైపు అధర్మం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ధర్మం వైపు నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. కడప జిల్లా ప్రజల కోసం వివేకా ప్రాణం పెట్టాడని, కానీ వైఎస్సార్ (YSR) కొడుకుగా జగన్ మాట మీద నిలబడలేదని ఇచ్చిన హామీలకి కట్టుబడి లేడని నిప్పులు చెరిగారు. మాట తప్పడం వైఎస్సార్ జీవితంలో లేదని.. కానీ వైఎస్సార్ వారసుడు మాటను మడతపెట్టేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా మరిచారని, వాగ్ధానాలు ఒక్కటి అమలు కాలేదని చెప్పారు. మద్య నిషేధం అని చెప్పి లిక్కర్ మాఫియా నడిపిస్తున్నారని, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, మద్యం పేరుతో వచ్చిన ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం వైఎస్సార్ ఎన్నో పథకాలు తీసుకొస్తే.. జగన్ పాలనలో రైతులు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా లేదన్నారు.

UK Evil Monster: మానవ రాక్షసుడు.. భార్యని చంపి, బాడీని 224 ముక్కలుగా నరికి..

రూ.4 వేల కోట్లతో ప్రత్యేక నిధి అని చెప్పి జగన్ మోసం చేశాడని షర్మిల ఆరోపించారు. రైతులను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యలకు కారణం అయ్యాడన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారన్నారు. సర్కార్ కొలువులన్ని ఖాళీగానే ఉన్నాయన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశాడని, 23 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడని, మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నాడని, కానీ అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా హోదా అడిగింది లేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి జగన్ బానిసయ్యాడని, రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రానికి హోదా ఇచ్చేది, తెచ్చేది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ అంశం కాంగ్రెన్ మేనిఫెస్టోలో కూడా ఉందని షర్మిల గుర్తు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 09:35 PM