UDAY Scheme: ఉదయ్ ఒప్పందంలో ఏముంది?
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:05 AM
ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న డిస్కమ్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. వాటి నష్టాలను శూన్యస్థాయికి తీసుకెళ్లి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందాన్ని తెచ్చింది.

ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న డిస్కమ్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. వాటి నష్టాలను శూన్యస్థాయికి తీసుకెళ్లి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందాన్ని తెచ్చింది. దీని ప్రకారం.. డిస్కమ్‌లకు ఉన్న 75 శాతం అప్పులను రాష్ట్రప్రభుత్వం తనమీదికి బదలాయించుకోవాలి. మిగిలిన 25 శాతం అప్పులను తీర్చుకోవడానికి పూచీకత్తు ఇవ్వాలి. దీనికి అంగీకరిస్తే దేశీయంగా జెన్‌కోలకు బొగ్గును సరఫరా చేయడమే కాకుండా కోల్ లింకేజీలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ ఒప్పందంలో చేరాలని కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లపాటు ఒత్తిడి చేసిన తర్వాత 2017 జనవరి 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేరింది.
అందుకు తెలంగాణ చేయాల్సిన పనులివీ
2017 మార్చి 31నాటికి డిస్కమ్‌లకు చెందిన అప్పు (రూ.8,923కోట్లు) 75శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనమీదికి మళ్లించుకోవాలి. మిగిలిన 25 శాతాన్ని ఈక్విటీగా మళ్లించుకోవాలి.
డిస్కమ్‌ల నష్టాలను కూడా భరించాలి. 2015-16లో డిస్కమ్‌లు చవిచూసిన నష్టాల్లో 5 శాతాన్ని, 2016-17; 2017-18, 2018-19ల్లో నష్టాల్లో 25 శాతం చొప్పున; 2019-20లో 50 శాతాన్ని 2020-21లో భరించాలి.
నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థల్లో వీధి దీపాలన్నీ ఎల్‌ఈడీలుగా మార్చాలి.
2018-19కల్లా వార్షిక ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం పూర్తిగా తగ్గాలి.
2017 జూన్ 30వ తేదీకల్లా పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్)కు మీటర్లు పెట్టాలి.
2018 మార్చి 31వ తేదీకల్లా గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ దాకా ఎనర్జీ ఆడిట్ చేయాలి.
2018 మార్చికల్లా వ్యవసాయ, గృహ , పారిశ్రామిక ఫీడర్లను వేరు చేయాలి.
500 యూనిట్లపైన విద్యుత్ వాడేవారికి 2018 డిసెంబరు 31కల్లా స్మార్ట్‌మీటర్లు బిగించాలి.
2019 డిసెంబరు 31 కల్లా 200 యూనిట్ల పైన వాడేవారికి స్మార్ట్‌మీటర్లు పెట్టాలి.
2019 మార్చికల్లా సాధారణ మోటార్ల స్థానంలో 10 శాతం విద్యుత్తును పొదుపు చేసే మోటార్లు బిగించాలి.