Share News

CM Revanth Reddy: సీఎంఆర్‌ఎఫ్‌.. ప్రక్షాళన!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:31 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద లబ్ధిదారులకు అందించే ప్రతి రూపాయికి ఇక నుంచి పక్కాగా లెక్క ఉండనుంది. చెక్కు తీసుకున్న లబ్ధిదారు ఎక్కడి వారు? ఏ జిల్లా? ఆరోగ్య సమస్య ఏంటి? ఆస్పత్రి బిల్లు ఎంతైంది? వంటి వివరాలన్నీ స్పష్టంగా ఆన్‌లైన్‌లోనే తెలియనున్నాయి.

CM Revanth Reddy: సీఎంఆర్‌ఎఫ్‌.. ప్రక్షాళన!

  • ప్రజాప్రతినిధులందరికీ లాగిన్‌ ఐడీలు

  • కమీషన్లు అడిగిన వారిపై క్రిమినల్‌ చర్యలు

  • అన్నీ ఆన్‌లైన్‌లోనే.. అంతటా పారదర్శకత

  • సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌వోసీ.. ఆరోగ్యశ్రీకి అటాచ్‌

  • ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం రేవంత్‌

  • అర్హులైన పేదలకే సాయం అందేలా చర్యలు

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద లబ్ధిదారులకు అందించే ప్రతి రూపాయికి ఇక నుంచి పక్కాగా లెక్క ఉండనుంది. చెక్కు తీసుకున్న లబ్ధిదారు ఎక్కడి వారు? ఏ జిల్లా? ఆరోగ్య సమస్య ఏంటి? ఆస్పత్రి బిల్లు ఎంతైంది? వంటి వివరాలన్నీ స్పష్టంగా ఆన్‌లైన్‌లోనే తెలియనున్నాయి. ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్‌ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్‌ వ్యవస్థను కంప్యూటరీకరించే ప్రక్రియ పట్టాలెక్కి.. వేగంగా కొనసాగుతోంది. సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లులను ఆన్‌లైన్‌ చేసేందుకు ఇప్పటిదాకా ఆస్పత్రులకు మాత్రమే లాగిన్‌ ఐడీలు ఉండగా.. ఇకపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లాగిన్‌ ఐడీలు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది ఎవరైనా అవకతవకలకు పాల్పడినా, లబ్ధిదారులను కమీషన్లు అడిగినా.. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రేవంత్‌ ఆదేశించారు. మొత్తంగా సీఎంఆర్‌ఎ్‌ఫపై రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులైన పేదలకే సాయం అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.


ఆరోగ్య శ్రీకి అనుసంధానం

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతోపాటు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) జారీలోనూ మరింత పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌వోసీ రెండింటినీ సదరు పేషంట్ల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని జబ్బులతో ఇబ్బంది పడుతూ, చికిత్స తీసుకునేవారికి ముఖ్యమంత్రి విచక్షణ మేరకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ప్రభుత్వం తరపున చెల్లిస్తామని ఆస్పత్రికి గ్యారెంటీ) ఇస్తారు. కొన్ని జబ్బులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చినా.. పేషంట్లు కూడా కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సదరు పేషంట్లు చికిత్స కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని ఆస్పత్రుల దగ్గర బిల్లులు తీసుకుని సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకుంటుంటారు. ఒక్కోసారి బిల్లులు సరిగా లేకపోతే కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవి. ఆ విధానానికి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలకనుంది. దరఖాస్తులను పరిశీలించి.. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంత మేర నిధులు చికిత్సకు పొందారు? ఎంత మేర సొంతంగా ఖర్చు చేశారనేది తేల్చి.. ఆర్థిక సాయం అందించనుంది.


ఇక నుంచి ఐడీ నంబరే కీలకం..

గత ప్రభుత్వం హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పకడ్బందీగా జరగలేదన్న విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల దగ్గర పని చేసే సిబ్బంది... లబ్ధిదారుల దగ్గర కమీషన్ల కోసం కక్కుర్తి పడేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకపై అలాంటి అవకతవకలు, కమీషన్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రజాప్రతినిధుల స్థాయిలోనే ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజాప్రతినిధులకు ఒక లాగిన్‌ ఐడీని ఇచ్చి.. వారి దగ్గరకు వచ్చే పేషంట్ల వివరాలను సీఎంఆర్‌ఎఫ్‌ పోర్టల్‌లో నమోదు చేయించనున్నారు. దాంతో దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తవ్వగానే అటు పేషంట్‌కు, ఇటు ప్రజాప్రతినిధి ఇద్దరి ఫోన్‌ నంబర్లకు ఒక ఐడీ నంబర్‌ మెసేజ్‌ వస్తుంది. అలా వచ్చిన ఐడీ నెంబరే.. లబ్ధిదారులకు చెక్కు అందే వరకు కీలకం.


పోర్టల్‌లో ఐడీ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే దరఖాస్తు ఏ స్థాయిలో ఉందనే వివరాలు తెలుసుకోవచ్చు. తద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్రంలో మూడు నెలల నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోడ్‌ ముగియడంతో మంజూరైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దాదాపు 65వేల చెక్కులు అన్ని రకాల విచారణలను పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉండగా, 25వేల చెక్కులు ఆస్పత్రుల దగ్గర విచారణలో, మరో 25వేల చెక్కులు వివిధ స్థాయుల్లో ప్రాసె్‌సలో ఉన్నాయి.

Updated Date - Jun 08 , 2024 | 03:31 AM