Share News

CM Revanth Reddy: గుజరాత్‌ వర్సెస్‌ తెలంగాణ..

ABN , Publish Date - May 08 , 2024 | 05:35 AM

డిసెంబర్‌లో గెలిచింది సెమీ ఫైనల్సే.. ఇప్పుడున్నవి ఫైనల్స్‌. అసలు కథ ఇప్పుడు మొదలైంది.. తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌.. ఎవరు గెలుస్తారో చూద్దాం..

CM Revanth Reddy: గుజరాత్‌ వర్సెస్‌ తెలంగాణ..

అటు మోదీ.. ఈ పక్కన మీ రేవంత్‌.. ఈ ఫైనల్స్‌లో ఎవరు గెలుస్తారో చూద్దాం

  • బిడ్డ బెయిల్‌ కోసం కేసీఆర్‌ వరంగల్‌ సీటును బీజేపీకి తాకట్టు పెట్టారు.. 2 పార్టీలూ ఒక్కటే

  • ఢిల్లీ సుల్తాన్లను ఓడించిన పౌరుషాలగడ్డ ఇది

  • హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌నూ అభివృద్ధి చేస్తా.. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌

వరంగల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘డిసెంబర్‌లో గెలిచింది సెమీ ఫైనల్సే.. ఇప్పుడున్నవి ఫైనల్స్‌. అసలు కథ ఇప్పుడు మొదలైంది.. తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. ఫైనల్లో ఆ పక్కన నరేంద్రమోదీ, అమిత్‌షా.. ఈ పక్కన మీ అన్న ఉన్నడు.. రాహుల్‌గాంధీ ఉన్నడు.. మే 13న జరగబోయే దంగల్‌లో.. ఫైనల్‌లో.. గుజరాత్‌ టీమ్‌ను డకౌట్‌ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తా, వరంగల్‌ పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగుల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


‘వాన పడ్డా, ఉరుములు ఉరిమినా, పిడుగులు పడ్డా మీ దగ్గరకు ఎందుకు వచ్చినా అంటే.. రేపు జరగబోయేవి ఎన్నికలు కావు.. పోరాటం కాదు.. రేపు జరగబోయేది యుద్ధం. అందులో వరంగల్‌ బిడ్డలు నా పక్కన నిలబడాలి.. ఈ యుద్ధంలో గెలవాలి.. గుజరాత్‌ను ఓడించాలి.. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించినోళ్లం అయితాం’ అని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తాన్లను ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పి కొట్టిందని, వారిపై గెలిచిన పౌరుషం కాకతీయుల బిడ్డలదని.. ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి, ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా మారాలని రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చని బీజేపీకి ఓటెందుకు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు. వాటిని నెరవేర్చకుండా ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రాంతానికి వస్తున్నారని నిలదీశారు. మోదీకి రాష్ట్రమన్నా, దేశమన్నా గుజరాతే అని దుయ్యబట్టారు.


బుల్లెట్‌ ట్రైన్‌.. సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌.. టెంపుల్‌ సిటీ.. అన్నీ గుజరాత్‌కేనని, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలనూ మోదీ తన రాష్ట్రానికే తరలించుకుపోతున్నారని.. తెలంగాణకుఇచ్చింది గాడిద గుడ్డేనని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ వేర్వేరు కాదని, అవి ఒక్కటేనని.. కాంగ్రె్‌సను దెబ్బ కొట్దేందుకు రెండు పార్టీలూ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అందుకే.. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నేతనే బీజేపీలోకి పంపించి టికెట్‌ ఇప్పించారని, బీఆర్‌ఎస్‌ నుంచి డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిడ్డ బెయిల్‌ కోసం వరంగల్‌ సీటును కేసీఆర్‌ బీజేపీకి తాకట్టు పెట్టాడని ఆరోపించారు.


కారు రిపేరుకు పోయిందని కేటీఆర్‌ అంటున్నారుగానీ.. కారు పోయింది తుక్కుకు తూకానికని.. ఇది గ్రహించే కేసీఆర్‌ బస్సులో తిరుగుతున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. మే 9 నాటికి రైతుభరోసా పూర్తిచేస్తానని తాను కేసీఆర్‌కు సవాల్‌ చేస్తే.. దాన్ని అడ్డుకోవాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఈసీకి ఫిర్యాదు చేశారని నిప్పులు చెరిగారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు పోతుంటే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమ చేశారని రేవంత్‌ గుర్తుచేశారు. నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ రైతుల ఖాతాలో డబ్బులు వేస్తేనేమో బీజేపీ వాళ్లకు సంతోషమైందని, అప్పుడు అడ్డుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు తాము రైతు భరోసా నిధులు వేయకుండా ఈసీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ ద్వంద్వ నీతి, దొంగ నీతి బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి చేస్తున్న కుట్ర అనే విషయం తెలంగాణ రైతులకు తెలుసునన్నారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని రేవంత్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Updated Date - May 08 , 2024 | 05:35 AM