Share News

CM Revanth Reddy: అదానీ.. వంద కోట్లు వద్దు

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:09 AM

‘‘ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్‌ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy: అదానీ.. వంద కోట్లు  వద్దు

ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాం

స్కిల్స్‌ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అదానీతో బీఆర్‌ఎస్‌ హయాంలో 5 ఒప్పందాలు

  • అదానీకి కేసీఆర్‌ వంగి వంగి దండాలూ పెట్టారు

  • అప్పట్లో కమీషన్లు మెక్కి ఇప్పుడు మాపై ఆరోపణలా?

  • అదానీతో ఒప్పందాలపై విచారణకు కేటీఆర్‌ సిద్ధమా?

  • ఇచ్చిన ప్రాజెక్టులపై కేసీఆర్‌పైనా విచారణ చేయాలా?

  • మీలా ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని కేసులు ఎత్తి వేయించుకోవడానికి మేం ఢిల్లీకి వెళ్లట్లేదు

  • ఎప్పుడు జైలుకెళ్దామా అని కేటీఆర్‌ చూస్తున్నాడు

  • వెళితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడు

  • ఆయనకన్నా ముందే కవిత జైలుకెళ్లింది మరి: రేవంత్‌

  • కేటీఆర్‌ను సైకో రామ్‌గా అభివర్ణించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్‌ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని పేర్కొంటూ అదానీ సంస్థకు జయేశ్‌ రంజన్‌ లేఖ రాశారు. అదానీ విషయంలో పక్క దేశాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదానికి, తెలంగాణకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ వివాదాల్లోకి అనవసరంగా మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని లాగవద్దు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నడుచుకుని టెండర్లు దక్కించుకునే.. పెట్టుబడులు పెట్టే అవకాశం ఏ సంస్థకైనా ఉంటుందని రాహుల్‌ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని, అయినా.. ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద అదానీ సంస్థ స్కిల్స్‌ వర్సిటీకి ఇస్తానన్న రూ.100 కోట్లను వద్దనుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్కిల్స్‌ వర్సిటీకి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని, అందులో భాగంగా అదానీ సంస్థ కూడా ముందుకు వచ్చిందని తెలిపారు. ‘‘ఆ వంద కోట్లు ఏదో మాకు అప్పనంగా ఇస్తున్నట్లు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. స్కిల్స్‌ వర్సిటీకి అదానీ సహా ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తెలంగాణ ప్రతిష్ఠపైనా.. వ్యక్తిగతంగా నాపైనా అనవసరమైన చర్చ జరగడం నాకు, మంత్రులకు ఇష్టం లేదు. అందుకే, ఆ నిధులు తీసుకోవడానికి సిద్ధంగా లేదంటూ లేఖ రాయించాం’’ అని వివరించారు.


  • అదానీతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఒప్పందాలు

అదానీతో విమానాల్లో ఆడంబరంగా తిరిగింది బీఆర్‌ఎస్‌ నాయకులేనని సీఎం రేవంత్‌ వెల్లడించారు. అదానీ సంస్థతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ సందర్భంగా ఏయే ప్రాజెక్టుల్లో అదానీతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందో ఆ వివరాలను వెల్లడించారు. అదానీతో కలిసి కేసీఆర్‌, కేటీఆర్‌ దిగిన ఫొటోలనూ ప్రదర్శించారు. అదానీకి కేసీఆర్‌ వంగి వంగి దండాలు పెట్టారని ఆ ఫొటో చూపిస్తూ విమర్శించారు. అదానీతో అన్ని ఒప్పందాలు చేసుకుని కమిషన్లు మెక్కినవారు.. రాష్ట్ర ప్రయోజనం కోసం స్కిల్‌ వర్సిటీకి వంద కోట్లు తీసుకుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అదానీతో చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఏకపక్షంగా రద్దు చేస్తే ఆయా సంస్థలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం అందరికీ ఉంటుందని, అంతే తప్ప.. అయాచితంగా, అప్పనంగా ఎవరికీ లబ్ధి చేకూర్చడం ఉండదని అన్నారు. ఓవైపు.. రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. మరో వైపు, వస్తున్న పెట్టుబడులును రద్దు చేసుకోవాలని మాట్లాడుతున్నారని, పెట్టుబడుల విషయంలో ఇంతకీ వారి విధానం ఏమిటంటూ నిలదీశారు. అదానీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్లపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెండర్లలో ఆయన భాగస్వామి అవుతారో లేదో తేలకుండా చర్యలు తీసుకుంటామన్న చర్చ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘‘అదానీతో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు కేటీఆర్‌ సిద్ధంగా ఉన్నారా? ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన కేసీఆర్‌పై విచారణ చేయాలా?’’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు 2023లో అధికారం, 2024 జూన్‌లో డిపాజిట్లు పోయాయని, ఇప్పుడు మెదడు కూడా పోయిందని ఎద్దేవా చేశారు.


  • మేము మీలా.. పైరవీల కోసం ఢిల్లీకి పోవట్లేదు

తమ ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరు కావడానికే తాను, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెళుతున్నామన్నారు. తాను, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్‌గా ఉన్నారని, తమను ప్రత్యకంగా ఆహ్వానించడంతో వెళుతున్నామని చెప్పారు. ‘‘కొంతమంది హర్రాస్‌ పాట పాడినట్లు 26వ సారి, 27వ సారి ఢిల్లీకి వెళుతున్నానంటూ నా పర్యటనకు లెక్కలు వేస్తున్నారు. నేనేమీ వాళ్లలాగా పైరవీల కోసమో.. మోదీ ముందు మోకరిల్లడానికో.. కాళ్లు పట్టుకుని కేసులు ఎత్తివేయించుకోవడానికో ఢిల్లీకి వెళ్లట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు సాధించుకునే ప్రయత్నంలో భాగంగా వెళుతున్నాం. గత పదేళ్లుగా కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వాళ్లు.. వారితో అంటకాగడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది’’ అని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి పార్లమెంటులో ప్రస్తావించడంపై తెలంగాణ ఎంపీలతో మంగళవారం సమావేశమై చర్చిస్తామన్నారు. ఇందుకు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మెట్రో రైలు, సాగునీటి కేటాయింపులు తదితర అంశాలు కేంద్రం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమీ బీజేపీ ఖజానా నుంచి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తున్నాయి. అవి రాష్ట్రాల హక్కు. ఫామ్‌ హౌస్‌లో పడుకుంటే ప్రయోజనం ఉండదు. రాజకీయ పక్షపాతం చూపకుండా వెళ్లి కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం. ఇందు కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళతాం’’ అని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మీడియాలో మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వస్తోందని, తన పర్యటనకు దానికి సంబంధం లేదన్నారు.

  • ఉప ఎన్నికల్లో ఓడించింది మోదీనే!

నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఆ రెండు స్థానాలనూ కాంగ్రెస్సే గెలిచిందని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ఈ రెండు సీట్లలో ప్రజలు మోదీని, కిషన్‌రెడ్డిని ఓడించి... రాహుల్‌ నాయకత్వాన్ని బలపరిచారని వ్యాఖ్యానించారు. వయనాడ్‌లో ప్రియాంకకు రాహుల్‌ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా యుతి మళ్లీ అధికారంలోకి వచ్చిందని, జార్ఖండ్‌లో అధికార కూటమి మరోసారి గెలిచిందని, బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు.


2.jpg


సైకో రామ్‌!

ఎప్పుడు జైలుకు వెళదామా అని కేటీఆర్‌ చూస్తున్నడు

వెళితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నడు

అలా అయితే ఆయనకన్నా ముందే కవిత జైలుకెళ్లింది

కేటీఆర్‌పై సీఎం రేవంత్‌ సెటైర్లు

కేసుల విచారణ త్వరగా జరిగి.. ఎప్పుడెప్పుడు జైలుకు వెళదామా అని కేటీఆర్‌ ఎదురు చూస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇటీవల మీడియాలో వచ్చింది చూసి.. జైలుకు వెళ్లినోళ్లు సీఎంలు అవుతున్నారని ఆయన అనుకుంటున్నారని, అట్లా అయితే ఆయన చెల్లెలు కవిత ఆయన కంటే ముందుగానే జైలుకు వెళ్లి వచ్చి.. ఆ చాన్స్‌ కొట్టేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను ‘సైకో రామ్‌’ అంటూ అభివర్ణించిన రేవంత్‌ రెడ్డి.. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:09 AM