Share News

Pharma City Land: ఫార్మాసిటీ ఇక నెట్‌ జీరో సిటీ

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:37 AM

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రణాళికలు చేస్తోంది. కాలుష్య రహితం, శత శాతం కర్బన ఉద్గారాల రహితంగా ‘నెట్‌ జీరో సిటీ’ నిర్మాణం చేయనుంది. ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన భూముల్లోనే ఈ నగరాన్ని నిర్మించనుంది.

Pharma City Land: ఫార్మాసిటీ ఇక నెట్‌ జీరో సిటీ

  • కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి

  • ఫార్మాసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక

  • 1న అక్కడే స్కిల్‌ వర్సిటీకి శంకుస్థాపన?

  • నేడు స్థల పరిశీలనకు సీఎం రేవంత్‌

  • (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రణాళికలు చేస్తోంది. కాలుష్య రహితం, శత శాతం కర్బన ఉద్గారాల రహితంగా ‘నెట్‌ జీరో సిటీ’ నిర్మాణం చేయనుంది. ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన భూముల్లోనే ఈ నగరాన్ని నిర్మించనుంది. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం దాదాపు 19వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించగా ఇప్పటిదాకా 12వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.


ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మల్టీమోడల్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడే ఇదే ప్రాంతాన్ని నెట్‌ జీరో సిటీగా అభివృద్ధి చేయనుంది. కాగా ఏదైనా ఓ ప్రాంతాన్ని వంద శాతం కాలుష్య, కర్బన ఉద్గార రహితంగా తీర్చిదిద్దడాన్ని నెట్‌ జీరో సిటీ అంటారు. ఆ ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాలు, ఇతర గ్రీన్‌ హౌస్‌ వాయువులను పూర్తిగా పీల్చుకునేలా చుట్టుపక్కల వృక్ష సంపదను పెంచి కాలుష్య రహితంగా మారుస్తారు. గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో న్యూయార్క్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 25 నగరాలు నెట్‌ జీరో సిటీలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణ నైపుణ్య విద్యాలయం‘ (స్కిల్‌ యూనివర్సిటీ) ఏర్పాటు పనులు చకచక సాగుతున్నాయి. నగర శివారుల్లో గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఈ వర్సిటీ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. అమెజాన్‌ డేటా సెంటర్‌ పక్కన ఉన్న దాదాపు వంద ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ స్థల పరిశీలనకు ఆదివారం కందుకూరు వస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక, టీఎ్‌సఐఐసీ ఎండీ విష్ణువర్థన్‌రెడ్డి శనివారం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆగస్టు 1న స్కిల్‌ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారని సమాచారం.యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏటా 20 వేల మందికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:37 AM