పాఠశాల భవనంపై నుంచి దూకి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:16 AM
బాగా చదవమని ప్రోత్సహించాల్సిన గురువే నీకు చదువు రాదంటూ హేళనగా మాట్లాడడంతో ఓ గురుకుల విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గతనెల 9న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బాగా చదవమని ప్రోత్సహించాల్సిన గురువే నీకు చదువు రాదంటూ హేళనగా మాట్లాడడంతో ఓ గురుకుల విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌గూడలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో గతనెల 9న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదార్‌పల్లికి చెందిన గడ్డ నాగరాజు కూతురు లావణ్య చెర్లపటేల్‌గూడలో గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరతగతి చదువుతోంది.
‘నీకు చదువు రాదు.. చదివి దండగ’ అని లావణ్యను పాఠశాలలో ఓ గురువు హేళన చేయడంతో మనస్తాపానికి గురై గత నెల 9వ తేదీ తెల్లవారుజామున పాఠశాల భవనం ఒకటో అంతస్థు నుచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తండ్రి చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం అదేనెల 25న లావణ్యను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తన కూతురు ఇంట్లో కదల్లేని పరిస్థితిలో ఉందని, టీచర్ తిట్టడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని అన్నారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం లావణ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.