State Revenue: ఆదాయంలో కోత!
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:30 AM
రాష్ట్ర రాబడులు తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 6 శాతం ఆదాయం తగ్గింది. ఈ సారి బడ్జెట్‌లో అన్నిరకాల రాబడులు రూ.2,74,057 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

నిరుటితో పోలిస్తే 6ు తగ్గుదల
రాష్ట్ర రాబడులు 51 శాతమే!
నవంబరు నాటికి రూ.1,41,178 కోట్లు
మొత్తం రాబడి లక్ష్యం రూ.2,74,057 కోట్లు
ఖర్చు రూ.1,38,556 కోట్లు
అంచనా వ్యయంలో ఇది 54ు
రాష్ట్ర సర్కారు ఆదాయ, వ్యయాలపై ‘కాగ్’ నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాబడులు తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 6 శాతం ఆదాయం తగ్గింది. ఈ సారి బడ్జెట్‌లో అన్నిరకాల రాబడులు రూ.2,74,057 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, ఇప్పటి వరకు రూ.1,14,178 కోట్లు మాత్రమే సమకూరాయి. అంటే మొత్తం అంచనాలో ఇది 51.51 శాతమే! గత ఏడాది అంచనా వేసిన మొత్తంలో ఇదే కాలానికి 57.46 శాతం రాబడులు సమకూరాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సర్కారుకు ఇది కొంత ఇబ్బందికర పరిస్థితే. నవంబరు నాటికి అన్ని రకాల రాబడులు, అప్పుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,41,178 కోట్లు సమకూరినట్లు కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వెల్లడించింది. రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన నవంబరు నివేదికలో ఈ విషయాలను వివరించింది. రెవెన్యూ రాబడుల కింద రూ.2,21,242 కోట్లను అంచనా వేయగా.. నవంబరు నాటికి రూ1,03,300 కోట్లు (51.32ు) సమకూరాయి. మూలధన రాబడుల కింద రూ.52,815 కోట్లను అంచనా వేయగా.. రూ.37,878 కోట్లు(71.72ు) వచ్చాయి.
మూలధన రాబడుల్లో ప్రధానంగా మార్కెట్ రుణాల కిందే రూ.37,850 కోట్లు ఉన్నాయి. అంటే బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.49,255 కోట్ల రుణాల్లో 76.84 శాతం రుణాన్ని ప్రభుత్వం తీసేసుకుంది. ఇక రెవెన్యూ రాబడుల్లో పన్నుల కింద రూ.93,553 కోట్లు వచ్చాయి. ఇందులో జీఎస్టీ రూ.33,766 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,524 కోట్లు, అమ్మకం పన్ను రూ.21,081 కోట్లు, ఎక్సైజ్ సుంకాలు రూ.12,364 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.11,472 కోట్లు, ఇతర పన్నులు రూ.5,343 కోట్లు సమకూరాయి. పన్నేతర రాబడి రూ.5,217 కోట్లు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.4,529 కోట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నవంబరు నాటికి అన్ని వ్యయాల కింద రూ.1,38,556 కోట్లను ఖర్చు చేసింది. ఇది అంచనా వ్యయం రూ.2,54,431 కోట్లలో 54.46 శాతం కావడం గమనార్హం.