Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగమూ కేంద్రం చేతికే!

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:57 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం.. మళ్లీ కేంద్రం చేతికే వెళ్లింది! ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగమూ కేంద్రం చేతికే!

  • అలైన్‌మెంట్‌ ఖరారు చేసి భూసేకరణకు అనుమతివ్వండి

  • భూములకు చెల్లించే పరిహారంలో 50ు వాటా మేమిస్తాం

  • ఉత్తర, దక్షిణ పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడండి

  • లేదా రెండో విడత కిందైనా దక్షిణ భాగం పనులు చేపట్టండి

  • కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కారు

  • దక్షిణ భాగాన్ని విజన్‌-2047లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం!

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం.. మళ్లీ కేంద్రం చేతికే వెళ్లింది! ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఉత్తర భాగంతో పాటు సమాంతరంగా దక్షిణభాగం పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని.. అలా సాధ్యం కాకపోతే, ఉత్తర భాగం పూర్తయిన వెంటనే దక్షిణ భాగం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి ఇటీవల లేఖ రాసింది. వాస్తవానికి కేంద్రం తెలంగాణకు ఆర్‌ఆర్‌ఆర్‌ మంజూరు చేసినప్పుడు.. ఉత్తర, దక్షిణభాగాలను తానే నిర్మించనున్నట్టు తెలిపింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. దక్షిణ భాగాన్ని రాష్ట్రప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా పలు చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు మాత్రం మనసు మార్చుకుని కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. ‘‘రోజురోజుకూ రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్‌ పార్కులతో ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతోంది.


15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డుపైనా వాహన రద్దీ పెరుగుతోంది. వచ్చే 5 ఏళ్లలో ఆ రద్దీ మరింత పెరుగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగంగా కేవలం ఉత్తరభాగాన్ని మాత్రమే నిర్మిస్తే ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించలేం. ఈ రోడ్డుకు సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించాం. కానీ రెండు భాగాలూ ఒకేసారి నిర్మిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే దక్షిణ భాగంవైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయం అధికమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణభాగం రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వండి. దక్షిణభాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటా కింద 50 శాతం వాటాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు భాగాలనూ ఒకేసారి నిర్మించేందుకు ఏమైనా ఆర్ధిక ఇబ్బందులుంటే.. ఉత్తరభాగం నిర్మాణం పూర్తయిన తరువాత రెండో విడ త కిందైనా దక్షిణభాగం రహదారి పనులను ప్రారంభించండి’’ అని ఆ లేఖలో పేర్కొంది. ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 90-95ు పూర్తయిందని, పరిహారం చెల్లించేందుకు ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది.


కేంద్రం పరిధిలోనే..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రీజినల్‌ రింగు రోడ్డును 2016లో మంజూరు చేసింది. అనంతరం 2017లో దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగం నర్సాపూర్‌ నుంచి తూప్రాన్‌-గజ్వేల్‌- జగదేవ్‌పూర్‌- భువనగిరి-చౌటుప్పల్‌ వరకూ 161.2 కిలోమీటర్లు ఉండగా, దక్షిణ భాగం చౌటుప్పల్‌ వద్ద ప్రారంభమై ఆమనగల్‌- షాద్‌నగర్‌ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపింది. వీటిలో మొదటగా ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భూ సేకరణ, అటవీ అనుమతులు, సహా వివిధ అంశాలతో దాదాపు ఆరేళ్లుగా రహదారి పనుల్లో జాప్యం జరగ్గా.. తాజాగా డిసెంబరు 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రహదారి నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించడంతో కీలక అడుగుపడింది. ఇదిలా ఉండగా.. ఇక దక్షిణభాగం రహదారికి సంబంఽధించిన పనులను కేంద్రం వెంటనే చేపట్టలేదు. భారత్‌మాల పరియోజన-1, 2 ప్రాజెక్టుల్లో ఈ రహదారిని ప్రతిపాదించినా అది ముందుకు కదల్లేదు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ కింద రిజర్వ్‌ చేసి ఉంచారు. ఇదిలా ఉండగా.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన విజన్‌-2047లో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని చేర్చింది. దానికి 2031లో అవార్డు పాస్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.


ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’.. నవంబర్‌ 4న ‘హై రయ్‌.. రయ్‌’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా ముందే తెలిపింది. అయితే.. ఉత్తర భాగం పూర్తయి, దక్షిణ భాగం పనులు మొదలు కాకపోతే భూముల ధరల నుంచి, రహదారి నిర్మాణ వ్యయం వరకూ అన్నీ పెరిగిపోతాయని గతంలోనే భావించిన రేవంత్‌ సర్కారు ఈ పనులు రాష్ట్రపరిధిలోనే చేపట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా వెంటనే రహదారి నిర్మాణం, అలైన్‌మెంట్‌, ఏ పద్ధతిలో రోడ్డును నిర్మించాలనే అంశాలపై ఐఏఎ్‌సల కమిటీని నియమించింది. ఫ్యూచర్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్‌ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కమిటీకి సూచించింది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్‌) తయారీ కోసం టెండర్లను ఆహ్వానించింది. డీపీఆర్‌ తయారీ కోసం ప్రభుత్వం నవంబర్‌ 25న టెండర్లను ఆహ్వనించగా.. తుదిగడువు డిసెంబర్‌ 27 నాటికి ఒక్క టెండరూ దాఖలు కాలేదు. దాంతో రీకాల్‌ పేరుతో మళ్లీ జనవరి 20 వరకూ టెండర్లకు అవకాశం ఇచ్చారు. ఇలా ఈ రహదారి నిర్మాణం కోసం ఇంతస్థాయిలో కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఉన్నట్టుండి కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రసర్కారు కోరిన విధంగానే ఉత్తర భాగంతో సమాంతరంగా నిర్మిస్తుందా? లేక విజన్‌-2047లో భాగంగా పనులు చేపడుతుందా అన్నది తేలాల్సి ఉంది.


మారిన అలైన్‌మెంట్‌..

రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేసినప్పుడు కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం దక్షిణభాగం చౌటుప్పల్‌ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానమవుతుంది. ఇది మొత్తం 189.2 కిలోమీటర్ల పరిధిలో ఉండగా.. దీని నిర్మాణానికి దాదాపు 2 వేల హెక్టార్ల భూమి అవసరమవనుంది. భూ పరిహారం కింద రూ.6,500 కోట్ల దాకా.. రోడ్డు నిర్మాణానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని అధికారుల ప్రాథమిక అంచనాల్లో తేలినట్టు సమాచారం. ప్రాథమిక అంచనాలతో రూపొందించిన నమూనాలో.. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని తంగెడ పల్లి, చింతలగూడెం, కోతులాపురం, గుడ్డి మల్కాపురం గ్రామాలుండగా, సంస్థాన్‌ నారాయణపురం మండలంలో సంస్థాన్‌ నారాయణపురం గ్రామం, కొత్తగూడెం, జనగాం, వావిళ్లపల్లి గ్రామాలున్నాయి. మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, అంతంపేట, మాల్‌ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారి వెళ్లనుంది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో.. సంగారెడ్డి మండలంలోని నాగాపూర్‌, ఇరిగిపల్లి, చింతల్‌పల్లి, కలబ్‌గూర్‌, తాళ్లపల్లి గ్రామాలుండగా, సదా శివపేట మండలంలో పెద్దాపూర్‌ గ్రామంలోనూ భూములు అవసరం కానున్నాయి.


కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌, గిర్మాపూర్‌ గ్రాహాలు, హత్నూర్‌ మండలంలోని కాసాల, దేవులపల్లి, హత్నూర, దౌల్తాబాద్‌, సికింద్లాపూర్‌ గ్రామాలు కూడా ఉన్నాయి. చౌటకూర్‌ మండలంలో శివ్వంపేట, వెండి కోల్‌, వెంకట కిష్టాపూర్‌, లింగంపల్లి, కోర్పోల్‌ గ్రామాలు, నర్సాపూర్‌ మండలంలో నాగులపల్లి, మూసాపేట, మహ్మదాబాద్‌, రెడ్డి పల్లి, కాజీపేట, తి రుమలాపూర్‌, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట, సీతారాంపూర్‌, రుస్తుంపేట, మంతూర్‌, మల్‌పర్తి, తుజాల్‌పూర్‌ గ్రామా లున్నాయి. శివ్వంపేట మండలంలో లింగోజీగూడ, పాంబండ, పోతులబొగుడ, కంసాన్‌పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్‌, కొత్తపేట గ్రామాలుండగా, కౌడిపల్లి మండలంలోని వెంకటాపూర్‌ గ్రామం సహా తూఫ్రాన్‌ మండలంలోని వెల్టూర్‌, జెండాపల్లి, నాగులపల్లి, ఇస్తాంపూర్‌, దాతార్‌పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్‌, వెంకటాయపల్లి, కిష్టాపూర్‌, నర్సంపల్లి గ్రామాల మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగానికి అనుసంధానం కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఈ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అలైన్‌మెంట్‌లో పలు మార్పులు చేసినట్టు తెలిసింది. దాని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి ముగిసిన తరువాత రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశమయ్యే దగ్గరి నుంచి సంగారెడ్డి వరకు ఉన్న రఽహదారిలో కొన్నిచోట్ల పలు కీలక మార్పులు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఈ భాగం కేంద్రం పరిధిలోకి వెళ్లనుండడంతో అలైన్‌మెంట్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది.


పాశ్చాత్యరీతిలో..

రోడ్డుకు ఇరువైపులా పాశ్చాత్య దేశాల తరహాలో రెస్టారెంట్లు, బాంక్వెట్‌ హాళ్లు, స్టార్‌ హోటళ్లు.. ఇలా వాణిజ్య కార్యకలాపాలకు అనుకూలంగా ఉండేలా ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని నిర్మించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే.. దారికి ఇరువైపులా సేకరించిన భూముల్లో రైతులకు కొంత వాటా ఇవ్వాలని కూడా కేంద్రం భావించినట్టు సమాచారం. కాగా.. జాతీయ రహదారుల నిబంఽధనల్లో మార్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణకు ముందుగానే పరిహారానికి సంబంధించిన నిధులను కేంద్రానికి డిపాజిట్‌ చేయాల్సి ఉంది.


అదనపు భూములు..

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం రహదారి కోసం సేకరించే భూములు కాకుండా.. దానికి అదనంగా రహదారికి ఇరువైపులా మరికొన్ని భూములను సమీకరించాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టు, బెంగళూరు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ మార్గం అనుకూలంగా ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్‌ పార్కులు, శాటిలైట్‌ టౌన్‌షి్‌పలను ఏర్పాటుచేసే దిశగా రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. భూములను సమీకరించి.. పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తోంది. అంతేకాకుండా సమీకరించిన భూములను లే అవుట్‌లుగా మార్చి, ఎకరాల వారీగా వెంచర్‌ వేయనున్నారు. అలా వేసిన వెంచర్లలో భూమి యజమానికి కొంత వాటా ఇచ్చి, ప్రభుత్వం కొంత వాటా తీసుకునేలా చర్యలు తీసుకోను న్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలపనున్నట్టు సమాచారం.

Updated Date - Dec 31 , 2024 | 04:57 AM