Share News

SLBC: అమెరికా నుంచి.. బేరింగ్‌ వస్తోంది!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:27 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) సొరంగమార్గం పనుల పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది.

SLBC: అమెరికా నుంచి..  బేరింగ్‌ వస్తోంది!

  • ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో కీలక అడుగు

  • మార్చి నెలాఖరు నుంచి పనులు పునఃప్రారంభం

  • సొరంగమార్గం తవ్వకం పూర్తయితే కీలకదశ దాటినట్లే

నల్లగొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) సొరంగమార్గం పనుల పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నుంచి సొరంగం తవ్వకం పనులను పునఃప్రారంభించేందుకు భారీ నీటిపారుదలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపే సొరంగం తవ్వే టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం)లో వినియోగించే బేరింగ్‌, కటింగ్‌ స్పేర్‌పార్ట్స్‌ పని ప్రదేశానికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. విదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌కు(టీబీఎం)విడి భాగాలు అన్నీ కూడా అమెరికాలోని రాబిన్స్‌ టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ తయారుచేసినవే వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనులు పునరుద్ధరించడానికి ఏడు మీటర్ల వ్యాసంతో 37 మెట్రిక్‌ టన్నుల బరువుండే బేరింగ్‌, ఇతర విడిభాగాలను అమెరికా నుంచి తెప్పిస్తున్నారు. ఈ సామగ్రి తయారీ కోసం రాబిన్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టులో ఇరిగేషన్‌ అధికారులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికాలోని ఓహియోకు వెళ్లారు. మంత్రి పర్యటన తర్వాత బేరింగ్‌ తయారుచేసిన కంపెనీ, ప్రస్తుతం దానిని చెన్నైకి తరలిస్తోంది. ఈ బేరింగ్‌తో పాటు, ఇతర స్పేర్‌పార్ట్స్‌ వచ్చే ఏడాది మార్చి మొదటివారంలో ఎస్‌ఎల్‌బీసీ పని ప్రదేశానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మార్చి నెలాఖరుకు పనులు ప్రారంభమవుతాయనే ధీమాతో అధికార యంత్రాంగం ఉంది. సొరంగమార్గం పనులతో పాటు నక్కలగండి రిజర్వాయర్‌, పెండ్లిపాకల రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులు, నిర్వాసితులకు ఉద్దేశించే పునరావాస, పునర్నిర్మాణ పనులు పూర్తి చేసే అంశంపైనా దృష్టి పెట్టింది.


పనులకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులు

ఎస్‌ఎల్‌బీసీ పథకంలో కీలకమైన సొరంగ మార్గంలో పది మీటర్ల డయాతో మొత్తం 43.930 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వేందుకు, రెండువైపులా పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 34.370 కిలోమీటర్లు పూర్తవగా, ఇంకా 9.560 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అవుట్‌ లెట్‌-1లో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌లో వినియోగించే బేరింగ్‌ మరమ్మతుతో ఆ పనులు ఆగిపోగా, ఇన్‌లెట్‌ వైపు నుంచి చేపట్టిన సొరంగంలో పనులు ముందుకు సాగకుండా 2019 నుంచి ఊటనీరు వచ్చి చేరుతోంది. అంతేకాక పనులు చేస్తున్నప్పుడు మట్టి, రాళ్లు కూలుతున్నాయి. దీంతో ఇక్కడ ఊటనీటిని తోడివేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు, ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా ఉండేలా సిమెంట్‌, పాలియేరిథిన్‌తో గ్రౌటింగ్‌ చేయిస్తున్నారు. బేరింగ్‌తో పాటు, ఇతర స్పేర్‌పార్ట్స్‌ అన్నీ వచ్చిన తర్వాత రెండువైపులా పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈ పనులన్నిటినీ సెప్టెంబరు, 2027 నాటికి వందశాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఇంజనీర్లకు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి లక్ష్యాన్ని నిర్వేశించింది. అంతేకాకుండా ఇక్కడ చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయాలని, గ్రీన్‌చానల్‌లో నిధులు అందుబాటులో ఉంచారు.


బేరింగ్‌ రాగానే పనులు మొదలుపెడతాం

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌లోని బేరింగ్‌ మరమ్మతుల నేపథ్యంలో పనులు ఆగిపోయాయి. ఈ బేరింగ్‌ తయారీ కంపెనీతో ప్రభుత్వం ప్రత్యేకంగా సంప్రదించి బేరింగ్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఓడ ద్వారా అది అమెరికా నుంచి బయలుదేరింది. ఫిబ్రవరి మొదటి వారానికి బేరింగ్‌, ఇతర స్పేర్‌పార్ట్స్‌ చెన్నై చేరుకోగానే, అక్కడినుంచి ఇక్కడికి తెప్పిస్తాం. ఈ యంత్రాలతో పాటు, ఇతర పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బేరింగ్‌ రాగానే దాన్ని బిగించి పనులు మొదలుపెడతాం.

- సత్యనారాయణ, ఈఈ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు

Updated Date - Dec 28 , 2024 | 05:27 AM