Share News

Kamareddy: ఆత్మహత్యలపై పోలీస్‌ శాఖ సీరియస్‌?

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:43 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, ఓ యువకుడు మృతి చెందిన మూకుమ్మడి ఆత్మహత్యల ఘటనపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సీరియస్‌ అయినట్లు తెలిసింది.

Kamareddy: ఆత్మహత్యలపై పోలీస్‌ శాఖ సీరియస్‌?

  • ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ మృతిపై ఉన్నతాధికారుల ఆరా!

  • దర్యాప్తు ముమ్మరం.. స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ

కామారెడ్డి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, ఓ యువకుడు మృతి చెందిన మూకుమ్మడి ఆత్మహత్యల ఘటనపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేదాక జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారని, వారి మధ్య ఉన్న సంబంధాలపై పోలీసుశాఖలో చర్చ సాగినప్పటికీ ఎందుకు నిఘా పెట్టలేకపోయారని నిలదీసినట్లు తెలిసింది.


ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ సింధూశర్మను రాష్ట్ర పోలీసుశాఖ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసు విచారణను జిల్లా పోలీసులు ముమ్మరం చేయగా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తుకు ఎస్పీ మూడు టీంలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కేసు విచారణకు కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌, సీసీ పుటేజీ, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి.

Updated Date - Dec 28 , 2024 | 05:43 AM