Share News

Medical Research: దేహం.. దానం!

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:14 AM

మరణానంతరం తమ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్‌ కాలేజీలకు దానం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

Medical Research: దేహం.. దానం!

  • వైద్య పరిశోధనలకు స్వచ్ఛందంగా మృతదేహాల అప్పగింత

  • ముందుగానే వీలునామాలు

  • ఇటీవల మారుతున్న ప్రజల వైఖరి

  • ఎక్కువగా కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాల్లో..

  • ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ కాలేజీలో 65 శవాలు

  • సర్కారీ మెడికల్‌ కాలేజీల్లోనూ కొరతేం లేదు

  • ప్రైవేట్‌ కాలేజీలకు మాత్రం తప్పని తిప్పలు

  • ఒక్కో కాలేజీకి 10 శవాలు అవసరం

  • లభించక రబ్బరు బొమ్మలతోనే బోధన ప్రాక్టికల్‌ జ్ఞానం లేకుంటే కష్టమే: నిపుణులు

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మరణానంతరం తమ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్‌ కాలేజీలకు దానం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవడం కంటే నలుగురు వైద్యులు నేర్చుకునేందుకు తమ దేహం ఉపయోగపడడమే మంచిదని భావించే వారు పెరుగుతున్నారు. ఒకర్ని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాల్లో ఈ తరహా వైఖరి పెరుగుతోంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో 65 శవాలు ఉండగా, అవన్నీ వారి కుటుంబ సభ్యులు దానంగా ఇచ్చినవే కావడం గమనార్హం. కానీ, ఇలాంటి పరిస్థితి అన్ని చోట్ల కనిపించడం లేదు. సర్కారీ వైద్య కళశాలల్లో శవాల కొరత లేనప్పటికీ.. ప్రైవేట్‌ కాలేజీలు మాత్రం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది. తమ విద్యార్థులు నేర్చుకునేందుకు శవాలు కావాలంటూ డీఎంఈకి ఆయా కాలేజీలు దరఖాస్తు చేసుకోవడం.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.


ప్రతీ 25 సీట్లకు ఒక శవం తప్పనిసరి

వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలోనే అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) ఒక సబ్జెక్టుగా ఉంటుంది. విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకునే క్రమంలో భాగంగా శవాల(కెడావర్‌ల)ను కోసి శరీర నిర్మాణం గురించి అధ్యాపకులు వివరిస్తారు. అనంతరం ఆ కోసిన శవాలను ప్రత్యేక రసాయనాలతో నింపిన ట్యాంకులలో భద్రపరుస్తారు. అలా ఒక శవాన్ని పదే పదే కోసి... శరీర నిర్మాణం గురించి విద్యార్థులకు వివరిస్తారు. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య ఆధారంగా ఆయా కాలేజీల్లోని అనాటమీ విభాగానికి శవాలు కావాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 25 సీట్లకు ఒక శవం అవసరం ఉంటుంది. అంటే... 250 సీట్లు ఉండే ఒక మెడికల్‌ కాలేజీకి ఏడాదికి సగటున 10 శవాలు కావాలి. మానవ శరీరం నిర్మాణం, అవయవాల పనితీరు, లోపాలు, వ్యాధిగ్రస్తమైతే ఏమవుతుంది? వంటి అంశాలను డిస్సెక్షన్‌(డెడ్‌బాడీని కోసి చూడడం) ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. అప్పుడే వారికి ప్రాక్టికల్‌ జ్ఞానం వస్తుంది.


ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు కష్టమే..

సాధారణంగా దానం కింద వచ్చిన శవాలనే వైద్య పరిశోధనల కోసం వినియోగించాలన్నది నైతిక నియమం. అనాథలు, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలను ఎవరూ తీసుకెళ్ల లేదన్న కారణంతో(అన్‌క్లైమ్డ్‌ డెడ్‌బాడీ్‌సను) వైద్య పరిశోధనల కోసం వినియోగించకూడదు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఇలాంటి శవాలను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్త మెడికల్‌ కాలేజీల సంఖ్య పెరగడంతో గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక జీవోను జారీ చేసింది. నిర్ణీత సమయంలోగా ఆయా శవాలను తీసుకెళ్లడానికి ఎవరూ రాకుంటే.. వాటిని మెడికల్‌ కాలేజీల కోసం వినియోగించుకోవచ్చన్నది దాని సారాంశం. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం శవాల కొరత పెద్దగా లేదనే చెప్పాలి. అయితే, ప్రైవేటు వైద్య కళాశాలలకు శవాలు దొరకడం కష్టంగా మారింది. వాస్తవానికి ఆయా కాలేజీలకు దేహ దానం చేసే వారు తక్కువగా ఉంటారు. ప్రమాదాల బారిన పడి చికిత్స కోసం వచ్చిన వారెవరైనా మరణించినా.. పోస్టుమార్టం నిమిత్తం మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులకే పంపుతారు. దీంతో ప్రైవేటు వైద్య కళాశాలల్లో శవాలు అందుబాటులో ఉండడం లేదు.


డీఎంఈకి కాలేజీల నుంచి అర్జీలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో ఉండే అన్‌క్లైమ్డ్‌ మృతదేహాలను వైద్య పరిశోధనల నిమిత్తం ప్రైవేటు వైద్య కళాశాలలకు అప్పగించేందుకు వీలుగా గతంలో ఒక జీవోను జారీ చేశారు. ఇందుకోసం ఒక్కో మృతదేహానికి రూ.60వేల చొప్పున ఆయా ప్రైవేట్‌ కాలేజీలు చెల్లించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఇటీవల కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు తమకు శవాలు కావాలని డీఎంఈకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది కొత్తగా 150 సీట్లతో ప్రారంభమైన ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యం.. తమకు 15 శవాలు కావాలని అభ్యర్థించినట్లు తెలిసింది. కొన్ని మెడికల్‌ కాలేజీలు శరీర నిర్మాణాలను పోలి ఉండే రబ్బరు బొమ్మలను తీసుకువచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు నేర్పిస్తున్నాయి. ప్రాక్టికల్‌గా శవాలను కోసి, శరీర నిర్మాణం గురించి తెలుసుకున్నప్పుడు మానవ దేహంపై పూర్థిస్థాయిలో అవగాహన ఉంటుందని, రబ్బరు బొమ్మలపై నేర్చుకుంటే ఏం తెలుస్తుందని వైద్య విద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు భవిష్యత్తులో మంచి వైద్యులు కాలేరని చెబుతున్నారు.


గత నవంబరు 5న ఈడ్పుగంటి వెంకటరత్నమ్మ(92) మరణించారు. గతంలో ఆమె రాసిన వీలునామా మేరకు కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా కాలేజీకి అప్పగించారు. వెంకటరత్నమ్మ మరణించిన 5 రోజులకే ఆమె వియ్యంకురాలు వంకినేని హైమవతి(78) కూడా పరమపదించారు. ఇదే తీరులో ఆమె మృతదేహాన్ని సైతం కుటుంబ సభ్యులు ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకుని ఆమెరికాలో ఉండే వీరి బంధువు మరొకరు కూడా తన మరణానంతరం.. పార్థీవ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని వీలునామా రాశారు. వీరి మాదిరిగానే మరో ఐదారుగురు సైతం ఈ ఏడాది అదే కాలేజీకి వచ్చి వీలునామా రాసిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో వైద్య పరిశోధనల నిమిత్తం సుమారు 65 శవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా వారి కుటుంబ సభ్యులు ఇచ్చినవే. ఇంకా చెప్పాలంటే ఆ మృతదేహాలన్ని కూడా కమ్యూనిస్టు కుటుంబాలకు చెందినవే.


రబ్బరు బొమ్మలపై నేర్పడం చట్టవిరుద్ధం

వైద్యవిద్య విద్యార్థులకు మొదటి సంవత్సరం గట్టి పునాదిలాంటింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్టు సబ్జెక్టులుంటాయి. ఈ మూడింటి ద్వారా శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుంది? రసాయన ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుస్తుంది. విద్యార్థులు కేడావర్‌(మృతదేహాల)ను డిసెక్షన్‌ చేయడం ద్వారానే అంతా నేర్చుకుంటారు. ఇదంతా రబ్బరు బొమ్మలపై నేర్చుకోవడం చట్ట విరుద్ధం. ఎన్‌ఎంసీ నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఎన్‌ఎంసీ నిబంధనలను ప్రైవేటు కాలేజీలు పాటించడం లేదు.

- డాక్టర్‌ పుట్ట శ్రీనివాస్‌, మాజీ వైద్య విద్య సంచాలకులు

Updated Date - Dec 28 , 2024 | 04:14 AM