Share News

ACB: చిక్కిన లంచావతారాలు !

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:11 AM

భూ సర్వే, నాలా కన్వర్షన్‌ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్‌, డిప్యూటీ తహసీల్దార్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.

ACB: చిక్కిన లంచావతారాలు !

  • భూ సర్వే, నాలా కన్వర్షన్‌కు రైతుల నుంచి లంచాలు

  • సర్వేయర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ను పట్టుకున్న ఏసీబీ

శంకరపట్నం, దమ్మపేట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భూ సర్వే, నాలా కన్వర్షన్‌ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్‌, డిప్యూటీ తహసీల్దార్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. భద్రాద్రి జిల్లా దమ్మపేట దమ్మపేటకు చెందిన రైతు వెంకట్‌ తన భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ.. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్‌ మెరుగు వెంకటరత్నంను కలిశాడు. ఇందుకు ఆ సర్వేయర్‌ రూ.1.50 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. నెల రోజులుగా సర్వేయర్‌ చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు ఆయనకు లంచం ఇచ్చేందుకు అంగీకరించి, ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు.


శనివారం సర్వేయర్‌కు ఆ రైతు అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అరెస్టు చేశారు. అలాగే, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్‌రావు సర్వే నం.253లో తనకున్న వ్యవసాయ భూమిలో నుంచి 2.25 గుంటల్లో పాడి గేదెల పెంపకానికి షెడ్డు నిర్మాణం చేపట్టేందుకు నాలా కన్వర్షన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేశాన్ని సంప్రదించగా ఆయన రూ. 10వేలు డిమాండ్‌ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం మల్లేశానికి నవీన్‌రావు రూ.6వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారుల బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Updated Date - Dec 29 , 2024 | 05:11 AM