North Section: ఆర్‌ఆర్‌ఆర్ రైట్ రైట్
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:24 AM
ప్రతిష్ఠాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను ఆహ్వానించింది.

ఉత్తరభాగం పనులకు పచ్చజెండా.. టెండర్లు ఆహ్వానించిన ఎన్‌హెచ్‌ఏఐ
ఈ నెల 27నే మొదలు.. ఫిబ్రవరి 14వరకు అవకాశం
ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ వేయాలని సూచన
161 కి.మీ, 5 ప్యాకేజీలు, రూ.7,104 కోట్లతో ప్రాజెక్టు
గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు
ఈపీసీ విధానంలోనే.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
ఇంకా పూర్తికాని భూసేకరణ.. ఖరారు కాని పరిహారం
పెండింగ్‌లోనే ఎన్‌హెచ్ సంఖ్య.. పర్యావరణ అనుమతులు
టెండర్ల గడువుకల్లా ఈ పనులపూర్తికి కేంద్రం యోచన!
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 27నే టెండర్లను ఆహ్వానించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14ను చివరి తేదీగా గడువు విధించింది. ఆ లోపు కాంట్రాక్టర్లు బిమ్స్, ఈ-టెండర్స్ పోర్టళ్లలో టెండర్లను దాఖలు చేయవచ్చని పేర్కొంది. దాఖలైన టెండర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు తెరవనున్నట్టు తెలిపింది. రూ.7,104 కోట్లతో 161 కిలోమీటర్ల పొడవు రోడ్డును 5 ప్యాకేజీల్లో నిర్మాణం చేసేలా కిలోమీటర్ల వారీగా వివరాలను టెండర్లలో వివరించింది. అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది. అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్‌తోపాటు టెక్నికల్ బిడ్‌ల వారీగా సమర్పించాలని సూచించింది. ఈ రహదారిని 4లేన్లతో ‘యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్ వే’ విధానంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నారు. టెండర్లు ఖరారయి, పనులు మొదలుపెట్టినప్పటి నుంచి రెండేళ్ల కాలంలోనే పనులను పూర్తిచేయాలని, ఆ తరువాత 5ఏళ్లు రహదారి మెయింట్‌నెన్స్ కూడా చేయాలని నోటీసులో పొందుపరిచింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం రహదారిని ఈపీసీ విధానంలో నిర్మిస్తారనే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఈ ఏడాది నవంబరు 17న ‘ఆర్‌ఆర్‌ఆర్ దారి ఇలా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.
5 ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణం..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పనులను 5 ప్యాకేజీల్లో నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లలో పేర్కొంది. టెండర్ నోటీసుల ప్రకారం.. మొదటి ప్యాకేజీ గిర్మాపూర్ గ్రామం నుంచి మొదలై రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.1,529.19 కోట్లు అవుతుందని తెలుపుతూ టెండర్లను ఆహ్వానించింది. రెండో ప్యాకేజీ రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లామాపూర్ వరకు 26 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.1,114.80 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. మూడో ప్యాకేజీ ఇస్లామాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ ఉండగా, ఇందుకు రూ.1,184.81 కోట్లతో టెండర్లను పిలిచారు. నాలుగో ప్యాకేజీ ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.1,728.22కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. ఇక ఐదో ప్యాకేజీ కింద రాయగిరి నుంచి తంగడ్‌పల్లె గ్రామం వరకు 35 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.1,547.04 కోట్లతో టెండర్లను పిలిచారు. అన్ని ప్యాకేజీల పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్ల కాలంలో పూర్తి చేయాలని సూచించింది. ఇక ప్రతిపాదించిన ఽధరల్లోనే యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను కూడా కలిపినట్టు తెలిపింది.
పూర్తికాని భూ సేకరణ..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి ఓవైపు టెండర్లను ఆహ్వానించినా.. ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 1895 హెక్టార్ల భూమి అవసరమవుతుండగా.. 1862 హెక్టార్లకు 3డీ నోటిఫికేషన్‌ను (భూమిని సేకరించే ఉద్దేశ ప్రకటన) జారీ చేశారు. మొత్తం భూ సేకరణలో ఇప్పటివరకు 90-95 శాతం పూర్తయింది. ఇందులో 1320 హెక్టార్లకు అవార్డుల ప్రకటన జారీ చేయాల్సి ఉంది. మరో 427 హెక్టార్లకు సంబంధించి అవార్డుల విచారణ జరుగుతోంది. పలు జిల్లాల పరిధిలోని కొన్ని భూముల అంశం కోర్టుల్లో ఉండడంతో.. వీటి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తేలలేదు. పైగా అవార్డులు జారీ చేసి, విచారణ జరుగుతున్న భూముల పరిహారం విషయంలోనూ ఒక స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూముల సేకరణకు ఇచ్చిన ఉత్తర్వులతో తక్కువ ధరకు భూములను కోల్పోవాల్సి వస్తోందని, తమకు అధిక ధరను ఇవ్వాలంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం ధరలు పెంచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐకి కూడా సమాచారం ఇచ్చిందని, ధరల పెంపు విషయంలో ఆర్బిట్రేషన్‌కు వెళ్తే అక్కడ పరిష్కారమవుతుందనే యోచనలో ఉంది. మరోవైపు రహదారిని మంజూరు చేసినప్పుడు కేంద్రం దీనికి ఎన్‌హెచ్ నెంబర్ 161ఏఏను కేటాయించినట్టు చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో నెంబర్‌ను కేటాయించలేదు. పైగా కేంద్రం నుంచి అటవీ అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఇంకా పర్యావరణ అనుమతులను ఇవ్వలేదని సమాచారం. దీంతో ఈ మొత్తం అంశాలు పూర్తయ్యాకే రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. అయితే టెండర్లకు ఇచ్చిన గడువు పూర్తయ్యేనాటికి పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయాలనే యోచనలో కేంద్రం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
గత ప్రభుత్వం తీరుతో ఆలస్యం..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రీజినల్ రింగు రోడ్డును 2016లో మంజూరు చేసింది. ఆ తరువాత దానిని ఉత్తర, దక్షిణభాగాలు విభజించింది. తొలుత ఉత్తర భాగం పనుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతోపాటు, దీనిని భారత్‌మాల పరియోజన-1లో చేరుస్తూ ఎన్‌హెచ్ ‘నెంబర్ 161ఏఏ’ను కేటాయిస్తున్నట్టు తెలిపింది. కానీ, ఆ తరువాత రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన రాజకీయ గిల్లికజ్జాలతో రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. రహదారి పనులకు అవసరమైన స్థాయిలో గత ప్రభుత్వం సహకరించలేదు. ఫలితంగా భూ సేకరణ నుంచి రైతులకు చెల్లించాల్సిన పరిహారం ధరల వరకు అన్నీ పెండింగ్‌లోనే పడ్డాయి. మరోవైపు యుటిలిటీ షిప్టింగ్‌కు ఖర్చయ్యే రూ.363.63 కోట్ల విషయంలోనూ గత ప్రభుత్వం సరిగా స్పందించలేదు. మొత్తంగా పనుల్లో ఆలస్యం రాజ్యమేలింది. ఆ తరువాత రాష్ట్రంలో గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. యుటిలిటీ చార్జీలు చెల్లించేందుకు కూడా అంగీకరించారు. కానీ, యుటిలిటీ చార్జీలను తామే భరిస్తామంటూ కేంద్రమే భరోసానివ్వడంతో రాష్ట్రంపై రూ.363.63 కోట్ల ఆర్థికభారం కూడా తప్పింది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.15 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో దాదాపు రూ.5,200 కోట్లు భూ పరిహారానికి చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర వాటాగా రూ.2600 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. ఈ వాటాను.. పనులు ప్రారంభించే సమయానికి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది.
ఈపీసీ పద్ధతే ఎందుకంటే..
రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం రహదారిని ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తేనే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఈ రోడ్డుపై డీపీఆర్ కోసం ఎన్‌హెచ్‌ఏఐ నియమించిన కన్సల్టెన్సీ తమ నివేదికలో పేర్కొంది. అయితే నివేదికలో బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీవోటీ), హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హెచ్‌ఏఎం), ఈపీసీ పద్ధతులపై రోడ్డు నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందన్న వివరాలనూ పేర్కొంది. ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్ విలువలు, రహదారి నిర్మాణం తరువాత వసూలు చేసే టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని గణించిన తరువాతే ఈ పద్ధతుల్లో నిర్మిస్తే లాభదాయకమని వివరించింది. ఈ విధానాల్లో చేపట్టే నిర్మాణాలకు ప్రభుత్వం కొంతమేర గ్రాంట్ల రూపంలో నిధులను అందిస్తే నిర్మాణం పూర్తయిన తరువాత నుంచి 17ఏళ్లలోనే టోల్ వసూళ్ల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. కాగా, రోడ్డు నిర్మాణం తరువాత 2027 నుంచి 2046 వరకు (ఆ సమయానికి రహదారి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తేనే దాదాపు రూ.15,768 కోట్లు టోల్ వసూలు ద్వారా రాబడి ఉంటుందని, ఇది ఏటా 5 శాతం చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే అని నివేదికలో పొందుపరిచింది.
ఇది ప్రజా ప్రభుత్వ విజయం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం పనులకు కేంద్రం టెండర్లను ఆహ్వానించడం ప్రజా ప్రభుత్వ విజయం. ఇది సీఎం రేవంత్ కృషికి, నా కృషికి దక్కిన ఫలితం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఔటర్ రింగురోడ్డు గేమ్ చేంజర్ అయితే.. ఆర్‌ఆర్‌ఆర్ సూపర్ గేమ్ చేంజర్ కాబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించాక యుటిలిటీ చార్జీలను కూడా కేంద్రమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు గడ్కరీకి ధన్యవాదాలు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు సీఎం, నేను కలిసి జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమైంది. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి