Share News

Hyderabad: రాజధానిలో జడివాన..

ABN , Publish Date - May 17 , 2024 | 04:37 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్‌గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్‌ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్‌పేటలో 8.5, బేగంబజార్‌లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Hyderabad: రాజధానిలో జడివాన..

  • హైదరాబాద్‌లో కుండపోత.. యూసుఫ్‌గూడలో 9 సెం.మీ., మలక్‌పేటలో 8 సెం.మీ.పైనే

  • లోతట్టు ప్రాంతాల జలమయం

  • ట్రాఫిక్‌తో వాహనదారుల ఇక్కట్లు

  • జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు

  • పిడుగుపాటుకు ముగ్గురి మృతి

  • తడిసిన ధాన్యం.. పంటలకు దెబ్బ

  • నేడు, రేపు కూడా వానలు

  • అధికారులూ అప్రమత్తం: సీఎం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్‌గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్‌ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్‌పేటలో 8.5, బేగంబజార్‌లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్‌, అమీర్‌ పేట, ఎర్రగడ్డ, నాంపల్లి, అంబర్‌పేట, బేగంబజార్‌, గోల్కొండ, గౌలిగూడ, ఖైరతాబాద్‌, ఆసి్‌ఫనగర్‌, షేక్‌పేట, ఫిల్మ్‌నగర్‌, చార్మినార్‌, మూసాపేట, మోతీనగర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బోరబండ ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 9 ఉదయనగర్‌ కాలనీలో నాలా రిటైనింగ్‌వాల్‌ కూలడంతో రోడ్లపై నిలిచిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఆగాపురా, ఆస్మాన్‌గఢ్‌, మల్కాజిగిరి, రామచంద్రాపురంలో చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు శాఖ అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టారు. ఫిల్మ్‌నగర్‌, శ్రీకృష్ణానగర్‌ బీబ్లాక్‌ ప్రాంతాల్లో పలు షాపుల్లోకి వదర నీరు చేరింది. మధురానగర్‌, ఫిలింనగర్‌ , బేగంబజార్‌, మన్సూరాబాద్‌ డివిజన్‌ సాయినాథ్‌ కాలనీల్లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిల్చి గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వర్షాల నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-2111 1111, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 90001 13667కు సంప్రదించాలని వెల్లడించారు.


పలు జిల్లాల్లోనూ వర్షాలు..

ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కాంటా వేసిన ధాన్యం బస్తాలుకూడా తడిసి ముద్దయ్యాయి. హనుమకొండ పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. వరంగల్‌, నిజామాబాద్‌ పట్టణాల్లో భారీ వర్షం పడటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మునుగోడులో ఈదురుగాలులకు తోటల్లో మామి డి, నిమ్మకాయలు రాలిపోయాయి. కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌లో ఐదెకరాల అరటి తోట నేల కొరిగింది. పలుచోట్ల కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. చేవెళ్ల, కేశంపేట, యాచారం, దోమ, ఆలేరు, వలిగొండ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధారూర్‌ మండలంలో నాగారంలో 500 బస్తాలకు పైగా ధాన్యం తడిసింది.


పిడుగులు పడి ముగ్గురి మృతి..

పిడుగులు పడి వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌లోని భరత్‌నగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య(42) పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ మునిసిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబళ్ల శ్రీనివాస్‌ (30), రేగుల దేవ య్య, రేగుల శ్రీనివాస్‌, కంబళ్ల కొమురవ్వ, కంబళ్ల ఎల్లయ్య చింతచెట్ల కాయలు దులిపేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భారీవర్షంతో పిడుగుపడి శ్రీనివాస్‌ మృతి చెందగా.. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. కడ్తాల మండలం వాసుదేవ్‌పూర్‌లో మాడ్గుల మండలం కలకొండకు చెందిన పసునూరి ప్రవీణ్‌చారి (32), అతని మామ నాగోజు జంగాచారిపై పిడుగు పడింది. దీంతో ప్రవీణ్‌చారి మృతి చెందగా.. జంగాచారితో పాటు మరొకరు గాయపడ్డాడు. పరిగిలో వర్షానికి ప్రహరీ గోడ కూలి 15 మేకలు మృతి చెందాయి.


అప్రమత్తంగా ఉండండి: సీఎం

వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


నేడు, రేపు వర్షాలు..

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం.. గురువారం మధ్యప్రదేశ్‌కు నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

Updated Date - May 17 , 2024 | 04:37 AM