Share News

Rahul Gandhi: ఏడాదికి 1.3 లక్షలు..

ABN , Publish Date - May 06 , 2024 | 06:15 AM

కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. గత పదేళ్లలో మోదీ

 Rahul Gandhi: ఏడాదికి 1.3 లక్షలు..

  • తెలంగాణలోని పేదింటి మహిళ ఖాతాలో టకాటక్‌ వేస్తాం

  • ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.లక్ష.. రాష్ట్రమిచ్చేది రూ.30వేలు

  • ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తింపుగానే లక్ష చొప్పున..

  • ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారుల్ని చేస్తాం

  • రాజ్యాంగం రద్దుకు ఎన్డీయే కుట్ర.. రక్షించే లక్ష్యమే ‘ఇండియా’ది

  • అందుకే ఇవి ఎన్నికలు కావు.. 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం

  • మోదీ పనిచేసింది 22 మంది ఽధనికుల కోసమే..

  • వారికి రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు

  • మేం రైతులకు రుణమాఫీ చేస్తాం.. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం

  • నిరుద్యోగుల కోసం ‘పెహలీ నౌకరీ పక్కా’ పేరుతో ప్రత్యేక పథకం

  • దీనికింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌

  • దేశవ్యాప్తంగా జనగణన.. ప్రతి సంస్థనూ సర్వేచేస్తాం

  • ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది

  • తర్వాత క్రాంతికారీ రాజకీయాలతో ముఖచిత్రమే మారుతుంది

  • రిజర్వేషన్లపై పరిమితినీ ఎత్తేస్తాం.. 50శాతానికి మించి ఇస్తాం

  • తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం

  • మోదీ సర్కారు చిమ్మిన విద్వేషాల వీధుల్లో మేం ప్రేమను పంచాం

  • నిర్మల్‌, అలంపూర్‌ కాంగ్రెస్‌ జనజాతర సభల్లో రాహుల్‌ గాంధీ

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశంలోని 22 బడా కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేసిందని, పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని.. ‘ఇండియా’ కూటమి మాత్రం దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్న నిరుపేదలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించింద ని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో పురుషులతో పాటు మహిళలూ పనులకు వెళతారని, అయితే మహిళలు ఇంటి పనుల కోసం 8 గంటల అదనంగా పని చేస్తారని, ఇందుకు వారికి ఎలాంటి చెల్లింపులూ ఉండవన్నారు. వారి ఈ శ్రమను గుర్తించి నెలకు రూ.8,500 చొప్పున ఖాతాల్లో టకాటక్‌ పడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి నిరుపేద మహిళకు నెలకు రూ.2,500 చొప్పున చెల్లింపు హామీని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు తెలంగాణలోని ప్రతి పేద కుటుంబానికి చెందిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.30వేలు, కేంద్రం నుంచి రూ.లక్ష కలిపి రూ. 1.30 లక్షలు ఖాతాలో పడతాయని వివరించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో, గద్వాల జిల్లా అలంపూర్‌లో జరిగిన జనజాతర సభల్లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు విభిన్న సిద్ధాంతాలున్న రెండు సమూహాల మధ్య జరుగుతున్న యుద్ధం అని.. ఓవైపు రాజ్యాంగాన్ని రక్షించేందుకు ‘ఇండియా’ కూటమి, ఇంకోవైపు రాజ్యాంగాన్ని మార్చే ప్రణాళికలో ఉన్న ఎన్డీయే కూటమి నిలబడ్డాయని పేర్కొన్నారు. ‘‘దేశంలోని పేదలు, దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాల కోసం అంబేడ్కర్‌, మహాత్మా గాఽంధీ, నెహ్రూ రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ నలిపివేయాలని చూస్తోంది. ఆర్‌ఎ్‌సఎ్‌సతో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోంది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకం రిజర్వేషన్ల రద్దు అమల్లో భాగమేనని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ బీజేపీ నేతలు సూటిగానే ప్రజలకు చెబుతున్నారని.. రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీలోని పెద్ద పెద్ద నాయకులు, సంఘ్‌ ముఖ్య నాయకుడు తరచూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రైతుల రుణాలను ఎన్నడూ మాఫీ చేయని మోదీ ప్రభుత్వం.. అదానీ, అంబానీ కుటుంబాలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని, ఈ మొత్తం.. ఉపాధి హామీ పథకాన్ని 24 ఏళ్ల పాటు అమలు చేయడానికి అయ్యే నిధులతో సమనం అని అన్నారు.


జాతీయ జనగణన తేల్చాక ఇక క్రాంతికారీ రాజకీయాలే

దేశ జనాభాలో వెనుకబడిన వర్గాలు 50ు, దళితులు, మైనారిటీలు 15ు చొప్పున, ఆదివాసీలు 8ు, అగ్రకుల పేదలు ఐదు నుంచి ఆరు శాతం మేరకు ఉన్నారని.. మొత్తంగా 90 శాతానికి పైగా ఉన్న ఈ వర్గాల వారు దేశంలో పేరున్న ఏ సంస్థల్లోనూ కనిపించరని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న 90 మంది బ్యూరోక్రాట్లలో ఓబీసీలు, దళితులు ముగ్గురు చొప్పున, ఆదివాసీల నుంచి ఒకరు మాత్రమే ఉన్నారని.. పైగా వారికి ఇచ్చినవీ చిన్న చిన్న మంత్రిత్వ శాఖల్లోని పోస్టులేనని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే జన గణన, ఆర్థిక సర్వే చేస్తామని.. ప్రతి సంస్థనూ సర్వే చేస్తామని, ఫలితంగా 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల వద్ద ఉన్న సంప ద ఎంత? కొద్ది మంది ధనవంతుల చేతుల్లో ఉన్న సంపద ఎంత? అన్నది తేలిపోతుందన్నారు. జన గణన, ఆర్థిక సర్వే తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని, క్రాంతికారీ రాజకీయాలు నడుస్తాయని చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, అగ్రకుల పేదలు 90 శాతానికి పైగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్న నిబంధన అర్థరహితమన్నారు. రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేసి 50శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తామంటూ ప్రధాని మోదీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదని, రిజర్వేషన్ల అమలుకు ఆయన వ్యతిరేకమని విమర్శించారు.

నిరుద్యోగుల కోసం ప్రత్యేక పథకం

తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగుల కోసం ‘పెహలీ నౌకరీ పక్కా’ (మొదటి ఉద్యోగం గ్యారెంటీ) పేరుతో సరికొత్త పథకం తీసుకొస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వాస్పత్రులు, విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో నిరుద్యోగులకు అప్రెంటి్‌షషిప్‌ కింద ఏడాది పాటు ‘మొదటి ఉద్యోగం’ దొరుకుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు వారి కి ఏడాది పాటు నెలకు రూ. 8,500 చొప్పున రూ.లక్ష మొత్తం వారి బ్యాంకుఅకౌంట్లలో పడుతుందని చెప్పారు. అప్రెంటి్‌సషిప్‌ కాలంలో ఆయా చోట్ల మంచిగా పని చేస్తే ఉద్యోగం పర్మినెంట్‌ కూడా అవుతుందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే అన్నింటినీ భర్తిచేస్తామని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకొచ్చాక ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పిస్తాయని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణలోని ఆదివాసీలు, దళితులకు వారి భూముల పరంగా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించి శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రోజుకు ఇస్తున్న రూ.250ని రూ.400కు పెంచుతామని ప్రకటించారు.. ఆశా, అంగన్‌ వాడీల ఆమ్‌దానీని రెట్టింపు చేస్తామని చెప్పారు.


బీజేపీ చిమ్మిన విద్వేషాల వీధిలో ప్రేమ దుకాణాన్ని తెరిచాం

దేశ ప్రజల మధ్య మోదీ ప్రభుత్వం విద్వేషాన్ని పెంచిందని, అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెట్టిందని ఇదంతా ‘భారత్‌ జోడో’ యాత్రలో తాను ప్రజల ద్వారానే తెలుసుకున్నానని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా 4వేల కి.మీ మేర సాగించిన ఆ పాదయాత్రలో భాగంగా తాను ఎంతో మందిని కలిశానని చెప్పారు. బీజేపీ సృష్టించిన విద్వేషాల వీధిలో తాము ప్రేమ దుకాణాన్ని తెరిచామన్నారు. విద్వేషాలతో దేశానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, ప్రేమతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు

తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలల్లో పేదలకు ఎంతో మేలు చేసిందని రాహుల్‌ చెప్పారు. నిరుద్యోగులకు 30వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఆరోగ్య బీమా పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని, గ్యాస్‌ సిలిండర్‌ రూ.500కే ఇస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, పేదలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తునూ అమ లు చేస్తోందని కొనియాడారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - May 06 , 2024 | 06:45 AM