Share News

High Court: శిక్ష పడినా ప్రాథమిక హక్కులు దూరం కావు

ABN , Publish Date - May 21 , 2024 | 04:43 AM

జైలుశిక్ష పడినంత మాత్రాన ఖైదీలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరని హైకోర్టు స్పష్టం చేసింది. జైల్లో హత్యకు గురైన ఖైదీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓ హత్య కేసులో 2012 నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మెదక్‌ జిల్లా టేక్‌మల్‌ మండలం కౌసంగి గ్రామానికి చెందిన కరోళ్ల వెంకయ్య.. తనకు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

High Court: శిక్ష పడినా ప్రాథమిక హక్కులు దూరం కావు

  • జైల్లో హత్యకు గురైన ఖైదీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): జైలుశిక్ష పడినంత మాత్రాన ఖైదీలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరని హైకోర్టు స్పష్టం చేసింది. జైల్లో హత్యకు గురైన ఖైదీ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓ హత్య కేసులో 2012 నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మెదక్‌ జిల్లా టేక్‌మల్‌ మండలం కౌసంగి గ్రామానికి చెందిన కరోళ్ల వెంకయ్య.. తనకు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే 2012 జూలై నెలలో చర్లపల్లి జైల్లో దాసరి నర్సింహులు అనే తోటి ఖైదీ చేసిన దాడిలో మృత్యువాతపడ్డారు. తన భర్త మరణానికి జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 లక్షల పరిహారం ఇప్పించాలని అతడి భార్య జయమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. తోటి ఖైదీ చేసిన పనికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జైల్లో ఉన్న ప్రతి ఖైదీ ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని తెలిపింది. జైలుశిక్ష పడినంత మాత్రాన జైల్లో ఉన్న ఖైదీలు ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కోల్పోరని స్పష్టంచేసింది. నైపుణ్యం లేని కూలీకి ఇచ్చే రోజువారీ కనీస వేతనం ఆధారంగా పరిహారాన్ని లెక్కించినట్టు తెలిపింది. అందులో ఇప్పటికే ప్రభుత్వం చెల్లించిన రూ.లక్ష పోగా మిగిలిన రూ.6.20 లక్షలను 6 శాతం వడ్డీతో కలిపి మూడునెలల్లో చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది.

Updated Date - May 21 , 2024 | 04:43 AM