Share News

Hyderabad: మిగిలిన 44 మంది చిన్నారులెక్కడ..?

ABN , Publish Date - May 30 , 2024 | 04:55 AM

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసిన శిశు విక్రయాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆ ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణెలోని ముఠాల ద్వారా సుమారు 60 మంది చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించారు.

Hyderabad: మిగిలిన 44 మంది చిన్నారులెక్కడ..?

  • ఢిల్లీ, ముంబై, పుణెకు రాచకొండ పోలీసులు

  • పాపైతే స్కూటీ.. బాబైతే బైక్‌.. దళారుల కోడ్‌ భాష

  • శిశు విక్రయాల కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ సిటీ, మే 29(ఆంధ్రజ్యోతి): రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసిన శిశు విక్రయాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆ ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణెలోని ముఠాల ద్వారా సుమారు 60 మంది చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించారు. వీరిలో 16 మంది చిన్నారులను గుర్తించిన రాచకొండ పోలీసులు వారిని సీడబ్ల్యూసీ ద్వారా శిశువిహార్‌కు తరలించారు. అయితే, మిగిలిన 44మంది చిన్నారులు ఎక్కడ ఉన్నారనేది గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. కాగా, ఇప్పటిదాకా అరెస్ట్‌ అయిన 11 మంది నిందితులు ఢిల్లీకి చెందిన కిరణ్‌, ప్రీతీ, పుణెకు చెందిన కన్నయ్య, ముంబైకి చెందిన మరికొందరితో లింకులు పెట్టుకుని ఏజెంట్లుగా మారి రెండేళ్లుగా శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ముఠా సభ్యులను పట్టుకునేందుకు రాచకొండ సీపీ తరుణ్‌ జోషి,, ఢిల్లీ, ముంబై, పుణెకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను పంపించారు. ఇక, చిన్నారుల విక్రయం సమయంలో ముఠాకు చెందిన ఏజెంట్లు కోడ్‌ భాషను వినియోగించేవారని పోలీసులు గుర్తించారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాప కావాల్సిన వారు స్కూటీ అని, బాబును బైక్‌ అని పిలిచేవారు. కాగా, శిశు విక్రయ ముఠాలకు చెందిన ఏజెం ట్ల ద్వారా చిన్నారులను కొనుగోలు చేసిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, తాము ఇన్నాళ్లూ పెంచుకున్న పిల్లలను చూసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు బుధవారం సీడబ్ల్యూసీ, శిశు విహార్‌ అధికారులను ప్రయత్నించారు. కానీ, పిల్లలను కలిసేందుకు అనుమతినివ్వకపోవడంతో వారంతా బాధను దిగమింగుకుని వెనుదిరిగారు.

Updated Date - May 30 , 2024 | 04:55 AM