Share News

Hyderabad: ఆధార్‌ కార్డులో ఫొటో, నీ ముఖం ఒకటేనా?

ABN , Publish Date - May 14 , 2024 | 04:22 AM

పోలింగ్‌ బూత్‌ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్‌హాట్‌ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్‌ హోలీమదర్స్‌ గ్రామర్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌(నంబర్‌ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.

Hyderabad: ఆధార్‌ కార్డులో ఫొటో, నీ ముఖం ఒకటేనా?

  • పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళకు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న

  • నికాబ్‌ తొలగింపు.. వెనుదిరిగిన మహిళ

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఎల్‌వో

చాదర్‌ఘాట్‌, మంగళ్‌హాట్‌, చార్మినార్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ బూత్‌ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్‌హాట్‌ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్‌ హోలీమదర్స్‌ గ్రామర్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌(నంబర్‌ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓటువేసేందుకు కూర్చున్న ముస్లిం మహిళ-- రహ్మతున్నీసా వద్దకు వెళ్లారు. ఆమెతో.. ‘‘నీ ఆధార్‌ కార్డులో ఉన్న ఫొటో.. నీ ముఖం ఒకటేనా?’’ అంటూ నిలదీశారు. ఆమె నికాబ్‌(బుర్కాకు ఉండే ముసుగు)ను ఎత్తి చూశారు. ‘‘ఆధార్‌లో ఫొటో, నీ ముఖం వేరుగా కనిపిస్తున్నాయి. ఆధార్‌లో వయసుకు, నీ వయసుకు పొంతనే లేదు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాంతో రహ్మతున్నీసా ఓటు వేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో.. ఆస్మాన్‌గఢ్‌లో మీడియా మాధవీలతను ప్రశ్నించగా.. ‘‘పాస్‌పోర్టు తీసుకోవడానికి నికాబ్‌ తీస్తారు. ఆధార్‌ కార్డు కోసం ఫొటో దిగడానికీ నికాబ్‌ తీస్తారు. అదేవిధంగా ఓటు వేసేప్పుడు కూడా నికాబ్‌ తొలగించాలి’’ అని సమాధానమిచ్చారు. ఈ ఘటనపై పోలింగ్‌ బూత్‌ బీఎల్‌వో ఎం.అరుణ మలక్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. కాగా.. మంగళ్‌హాట్‌ పోలీ్‌సస్టేషన్‌లో కూడా మాధవీలతపై కేసు నమోదైంది. గోషామహల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. బీజేపీ నేత రాకేశ్‌, మరో వ్యక్తి మంగళ్‌హాట్‌లోని ఆర్కేపేట్‌ ప్రాంతంలో ఓటర్‌ స్లిప్పులు ఇస్తూ.. బీజేపీకి ఓటేయాలని ఓటర్లను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.


మంగళ్‌హాట్‌ ఠాణాకు చేరుకున్న మాధవీలత.. రాకేశ్‌, మరో యువకుడిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. కాగా, బీబీ బజార్‌ చౌరస్తా వైపు మాధవీలత వెళ్తున్న సమయంలోనే మజ్లిస్‌ నాయకుడు యాసర్‌ అర్ఫాత్‌ ఆమెకు ఎదురుపడ్డారు. వెంటనే యాసర్‌ తన కారులోంచి కిందకు దిగారు. దాంతో మజ్లిస్‌ కార్యకర్తలు మాధవీలత కారును అడ్డుకున్నారు. బీజేపీ-మజ్లిస్‌ వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. మాధవీలత కూడా కారులోంచి కిందకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీర్‌చౌక్‌ పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. రియాసత్‌నగర్‌లో 40వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ జరుగుతోందంటూ మాధవీలత ఫిర్యాదు చేశారు. దాంతో.. బూత్‌ లోపలికి వెళ్లిన పోలీసులు.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

Updated Date - May 14 , 2024 | 04:22 AM