Share News

NEET: నీట్‌ కౌన్సెలింగ్‌.. కన్వీనర్‌ కోటా అంత ఈజీ కాదు!

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:13 AM

నీట్‌ పేపర్‌ ఈజీగా వచ్చింది..! స్కోర్‌ పెరిగింది..! తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులనే సాధించారు..! దాంతో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు పోటీ భారీగా పెరిగి, ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు అంత ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గతేడాది 450స్కోర్‌ ఉన్నా.. వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీటు దక్కిం ది.

NEET: నీట్‌ కౌన్సెలింగ్‌.. కన్వీనర్‌ కోటా అంత ఈజీ కాదు!

  • 490కి పైగా మార్కులు సాధిస్తేనే ఎంబీబీఎస్‌ సీటు.. గత ఏడాది 450 స్కోర్‌కే ఏ కేటగిరి

  • ఈసారి రాష్ట్రం నుంచి.. 600+ స్కోర్‌ చేసిన విద్యార్థులు వెయ్యికి పైనే

  • ఆలిండియా ర్యాంకర్లు పెరగడంతో ఆందోళన

  • వారం, పది రోజుల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ ఈజీగా వచ్చింది..! స్కోర్‌ పెరిగింది..! తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులనే సాధించారు..! దాంతో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు పోటీ భారీగా పెరిగి, ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు అంత ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గతేడాది 450స్కోర్‌ ఉన్నా.. వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీటు దక్కిం ది. ఈ సారి మాత్రం 490-500 స్కోరు ఉంటే తప్ప ఆ పరిస్థితి కనిపించ డం లేదు..! ఏటా దేశవ్యాప్తంగా నీట్‌ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ నుంచి ఈసారి 77,849పరీక్షకు హాజరవ్వగా.. 47,371 మంది(60ు) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత శాతం 58గా ఉంది. గతేడాది 100 పర్సంటైల్‌(720/720 మార్కులు) సాధించిన వారు దేశవ్యాప్తంగా ఇద్దరే ఉండగా.. ఈసారి 67 మంది ఆ ఘనతను సాధించారు. ఆలిండియా టాప్‌-100 ర్యాంకర్స్‌లో రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఒక్కరేఉన్నా.. 700కు పైగా మార్కులొచ్చిన వారు వంద మందికి పైగా, 600మార్కులకు పైగా సాధించిన వారి సంఖ్య వెయ్యికిపైనే ఉందని తెలుస్తోంది. దీంతో కన్వీనర్‌ కోటాకు పోటీ తప్పదని నిపుణులు చెబుతున్నారు.


490 దాటడం తప్పనిసరి!

మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 56 వైద్య కళాశాలలున్నాయి. వాటిల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసె్‌స(డీజీహెచ్‌ఎ్‌స) అధికారులు వారం-పది రోజుల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులను విడుదల చేస్తారు. ఆ తర్వాత స్టేట్‌ ర్యాంకుల వివరాలు తెలుస్తాయి. ఆ వెంటనే కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైద్యవిద్య యూజీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. వెనువెంటనే అడ్మిషన్స్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ కాలేజీల్లో 15ు సీట్లను ఆలిండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలినవన్నీ కన్వీనర్‌ కోటా(ఏ కేటగిరీ) పరిధిలోకి వస్తాయి. ప్రైవేటు కాలేజీల్లో 50ు సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. గతేడాది 450 మార్కులు సాధించిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చింది. ఈసారి 490-500 మార్కులు వస్తేకానీ సీటు వచ్చే పరిస్థితులు ఉండబోవని నీట్‌ కోచింగ్‌ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది నీట్‌ రాయగా, 13.16 లక్షల మంది ఉత్తీర్ణతను సాధించారు. గతేడాదితో పోలిస్తే.. ఈసారి 16.85ు అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 480 స్కోర్‌ సాధించిన విద్యార్థికి ఆలిండియా స్థాయిలో 2.50లక్షల ర్యాంకు వచ్చింది. గత ఏడాది 480 స్కోరుకు ఆలిండియా ర్యాంకు 1.30 లక్షల్లోపే ఉంది. దీంతో ఈసారి ఆలిండియా ర్యాంకుల్లో వెనుకబాటు కనిపించింది. ఇది తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.


గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం

నీట్‌ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచి.. అత్యుత్తమ ఫలితాలను సాధించారు. మంచి ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆయా గురుకులాల కార్యదర్శులు బడుగుల సైదులు, సీతాలక్ష్మి అభినందనలు తెలిపారు.


నీట్‌ రద్దుకు విద్యార్థుల డిమాండ్‌

గత నెల 5న నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన వారిలో ఆరుగురు టాప్‌-1 ర్యాంకును మరో ఇద్దరు ఆ తర్వాతి ర్యాంకులను సాధించడాన్ని విద్యార్థులు కారణంగా చూపుతున్నారు. 67 మంది 720/720 స్కోరుతో మొదటి ర్యాంకును సాధించగా.. ఆ తర్వాతి రెండు ర్యాంకుల్లో ఉన్నవారికి 719, 718 మార్కులు రావడాన్ని తప్పుబడుతున్నారు. ఈ మార్కుల విషయంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) స్పష్టతనిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 14న ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ రోజే ఎలా ప్రకటిస్తారని సోషల్‌ మీడియాలో నిలదీస్తున్నారు. కాగా.. నీట్‌ పరీక్షను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థులు ఈ నెల 1న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం త్వరలో వెకేషన్‌ బెంచ్‌ ఎదుట లిస్ట్‌ అవ్వనుంది.

Updated Date - Jun 06 , 2024 | 05:13 AM